Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?

Allu Arjun Father In Law

Allu Arjun Father In Law

హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన ఐటీ కారిడార్‌ నానక్‌రామ్‌గూడలో చోటుచేసుకున్న ఓ రియల్ ఎస్టేట్ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా టాలీవుడ్ అగ్ర హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో దౌర్జన్యం కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పలు MNCs కొలువుదీరిన ఒక ‘స్పెషల్ ఎకనామిక్ జోన్’లో సెక్యూరిటీని బెదిరించి, గేట్లు బద్దలు కొట్టి కబ్జాకు యత్నించడం పారిశ్రామిక, సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. నానక్‌రామ్‌గూడ సర్వే నంబర్ 130లో ‘మంత్రీ కాస్మోస్’ అనే ప్రతిష్టాత్మక ఐటీ భవనం ఉంది. ఉదయం సుమారు 8.40 గంటల సమయంలో మురళీధర్ రెడ్డి, గడ్డం రవి అనే వ్యక్తుల నేతృత్వంలో కొందరు దుండగులు భవన ప్రాంగణంలోని సౌత్‌వెస్ట్ కార్నర్ గేట్ వద్దకు చేరుకున్నారు. అకస్మాత్తుగా గేటు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అక్కడున్న కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేసి, ఆ స్థలాన్ని తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు హడావుడిగా టిన్ షీట్లతో కంచెలు వేసేశారు.

అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిని నెట్టివేసి భౌతిక దాడికి దిగడమే కాకుండా.. తమ పనులకు అడ్డువస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డితో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరుల పేర్లను చేరుస్తూ మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి పెద్దిరాజు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దుండగులు ఆక్రమించిన స్థలం సాధారణమైనది కాదు. ఈ భవనం ప్రభుత్వ గుర్తింపు పొందిన SEZ. దీని దక్షిణ భాగంలో భారీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, వ్యర్థాల నిర్వహణ షెడ్లు ఉన్నాయి. ఒకవేళ అగ్నిప్రమాదం లాంటి అత్యవసర పరిస్థితి వస్తే ఫైర్ ఇంజిన్లు లోపలికి వెళ్లాలన్నా, నీటి ట్యాంకర్లు రాకపోకలు సాగించాలన్నా దుండగులు మూసేసిన ఈ సౌత్‌వెస్ట్ మార్గమే ఏకైక దిక్కు. ఇప్పుడు ఈ మార్గాన్ని ఆక్రమించడం వల్ల భవనంలోని ఐటీ సంస్థల కార్యకలాపాలకు, అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు వేలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ హైడ్రామాకు సంబంధించిన ప్రతి దృశ్యం ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. గేట్లు పగలగొట్టడం దగ్గరి నుంచి సెక్యూరిటీపై దౌర్జన్యం చేసిన విజువల్స్ అన్నీ ఓ పెన్ డ్రైవ్‌లో వేసి ఫిర్యాదుదారుడు పెద్దిరాజు గచ్చిబౌలి పోలీసులకు పక్కా ఆధారాలుగా సమర్పించారు. బహుళజాతి సంస్థల కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా తక్షణమే భద్రత కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దౌర్జన్య కాండపై కేవలం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లోనే కాకుండా.. డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా ఫిర్యాదు ప్రతులను అందజేశారు. స్వయానా కాంగ్రెస్ నేత కావడం, ఒక పాన్ ఇండియా స్టార్ హీరో బంధువు కావడంతో ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.