Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’లో శృంగార సన్నివేశాలున్నాయా?.. నిర్మాత దీప్తి షాకింగ్ క్లారిటీ!

Aliasrukmini

Aliasrukmini

నితిన్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ప్రస్తుతానికి నాని సమర్పణలో ఆయన ‘అలియాస్ రుక్మిణి’ అనే సినిమా చేస్తున్నాడు. ‘దండోరా’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన మురళీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. డిసెంబర్ నాలుగో తేదీన సినిమా రిలీజ్ కాబోతుండడంతో, నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మీద మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ను బట్టి సినిమాలో కొన్ని అడల్ట్ సీన్స్ ఏమైనా ఉంటాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఈ విషయం మీద నిర్మాత దీప్తి గంటా స్పందించారు. ఈరోజు మీడియాతో ముచ్చటించిన ఆమె, తాజా విశేషాలను పంచుకున్నారు.

ట్రైలర్‌లో హీరో ‘రుక్మిణి’ అనే మారుపేరుతో అడల్ట్ (శృంగార) పుస్తకాలు రాసే రచయితగా కనిపించడంతో, సినిమాలో కూడా అలాంటి బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ వివాదాస్పద అంశంపై చిత్ర నిర్మాత దీప్తి గంటా స్పందించారు. సినిమాలో అడల్ట్ టచ్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా బదులిచ్చారు. “కథ ప్రకారం హీరో ఆ పేరుతో పుస్తకాలు ఎందుకు రాస్తాడు, అసలు ఏం రాస్తాడనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. అయితే, ప్రేక్షకులకు ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను.. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఒక్క కట్ కూడా చెప్పకుండా (Zero Cuts) క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది” అని దీప్తి గంటా స్పష్టం చేశారు. తద్వారా ఇది అసభ్యత లేని, కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ అని ఆమె సంకేతాలిచ్చారు.