నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ సినిమా విడుదల ఆలస్యం కావడానికి వెనుక ఉన్న అసలు కారణం, నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ మరియు EROS మధ్య చాలా కాలంగా నలుగుతున్న ఆర్థిక వివాదమే. గతంలో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసి, నష్టాలు వచ్చాయని లేదా పెద్ద లాభాలు రాలేదని చెప్పిన నిర్మాణ సంస్థ, ఇప్పుడు బడా ప్రాజెక్టు విడుదల సమయంలో పాత అప్పులు తీర్చకపోవడం వల్లే EROS ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ గత కొన్నేళ్లుగా తమ సినిమాల విడుదల సమయంలో EROS సంస్థకు చెల్లించాల్సిన బాకీల గురించి EROS ప్రశ్నించిన ప్రతిసారీ, “బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో పెద్ద సినిమా చేస్తున్నాం. దాని ద్వారా వచ్చే లాభాలతో మొత్తం అప్పును తీరుస్తాం” అని హామీ ఇస్తూ వచ్చింది.
Also Read :Akhanda 2: కొత్త డేట్ ఫిక్స్.. రిలీజ్ ఆరోజే?
గతంలో 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన చిన్న, మధ్య తరహా చిత్రాలు ఆశించినంత విజయం సాధించలేదని, లేదా తక్కువ లాభాలు మాత్రమే వచ్చాయని చెబుతూ EROS అప్పులు తీర్చకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ‘అఖండ 2’ సినిమాకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడి, భారీ బిజినెస్ జరగడంతో, పాత హామీని నిలబెట్టుకుంటారని EROS సంస్థ భావించింది. సినిమా విడుదల కంటే ముందే, నవంబర్ నెలలోనే తమ అప్పులు పూర్తిగా చెల్లించాలని EROS, నిర్మాణ సంస్థను సంప్రదించింది. అయితే, 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా EROS ను ఏదో విధంగా ఒప్పించవచ్చని భావించింది. దీంతో, సంవత్సరాలుగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు, పెద్ద సినిమా విడుదల సమయంలో కూడా బాకీలను చెల్లించేందుకు సంస్థ చిత్తశుద్ధి చూపకపోవడంతో EROS తీవ్ర ఆగ్రహానికి గురైంది. అందుకే, కేవలం ‘అఖండ 2’ సినిమా విడుదలపైనే న్యాయపరమైన చర్యలకు దిగినట్లు సమాచారం.