బాలీవుడ్ మాస్ హీరో అజయ్ దేవగన్ ఎప్పుడు సినిమాలకే కాదు, తను చేసే ప్రకటనల కారణంగానూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే తాజాగా ఆయన పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఓవైపు పాన్ మసాలా, గుట్కా వంటి ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూనే, ఇప్పుడు ఆయన విస్కీ బ్రాండ్‌ను ప్రారంభించడం.
Also Read :Priyanka Chopra: సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో.. గ్లోబల్ గ్లామర్ ప్రియాంక చోప్రా
తాజాగా అజయ్ దేవగన్, కార్టెన్ బ్రదర్స్‌తో కలిసి “ది గ్లెన్ జర్నీస్” అనే లగ్జరీ సింగిల్ మాల్ట్ విస్కీ బ్రాండ్‌ను ఇండియాలో ప్రారంభించారు. ఈ విస్కీ స్కాటిష్ హైలాండ్స్‌లో ఉత్పత్తి చేయబడినదని, భారత్‌లో హై-ఎండ్ విభాగంలో 20 శాతం మార్కెట్ షేర్ సాధించడం తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ను ఉత్తరప్రదేశ్, హర్యానా, గోవా, చండీగఢ్ రాష్ట్రాల్లో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. అయితే అజయ్ దేవగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన అభిమానుల్లో, నెటిజన్లలో తీవ్ర నిరాశను కలిగించింది. “ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉత్పత్తులను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు?” అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఒక నెటిజన్ “అజయ్ దేవగన్ సాబ్ నోటి క్యాన్సర్, కాలేయ వైఫల్యం మధ్య ఎటువంటి తేడా చూపడం లేదు” అని వ్యంగ్యంగా రాశాడు. మరోవైపు ఇంకొకరు “ఇప్పుడు కేవలం సిగరెట్ బ్రాండ్ మాత్రమే మిగిలింది. దాన్నీ ప్రమోట్ చేస్తే అజయ్ దేవగన్ అన్ని అవయవాలను కవర్ చేసినట్లే” అంటూ కామెంట్ చేశారు. ఇంకా కొందరు “డబ్బు కోసం మనుషుల ప్రాణాలను లెక్క చేయడం లేదు” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల అభిప్రాయం ప్రకారం, అజయ్ దేవగన్ లాంటి స్టార్‌కి సామాజిక బాధ్యత ఎక్కువగా ఉండాలి. ఆయన లాంటి స్టార్‌ను లక్షల మంది యువత ఫాలో అవుతున్నారు. అలాంటి వ్యక్తి ఇలాంటి ఉత్పత్తులను ప్రచారం చేయడం తగదని అభిమానులు అంటున్నారు.