మూడు నెలలు జైలు జీవితం గడుపుతున్నా నటుడు దర్శన్ బలుపు ఏమాత్రం తగ్గలేదు. లాయర్‌ని కలిసేందుకు వస్తుండగా మీడియా కెమెరాలకు నటుడు దర్శన్ మధ్యవేలు చూపించి ఫేక్ స్మైల్ చేశాడని తెలిసింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో మూడు నెలలు జైలు జీవితం గడిపినప్పటికీ నటుడు దర్శన్‌లో అహం తగ్గలేదని అంటున్నాయి కన్నడ మీడియా వర్గాలు. బళ్లారి సెంట్రల్ జైలులో తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదిని కలిసేందుకు హై సెక్యూరిటీ జైలు నుంచి బయటకు వస్తుండగా మీడియా కెమెరాలకు మధ్య వేలు చూపిస్తూ అనుచితంగా ప్రవర్తించారు.
బళ్లారి కేంద్ర కారాగారంలో ఉన్న నటుడు దర్శన్ కొద్దిరోజుల క్రితం మీడియాలో ఏమేం వస్తున్నాయో చూసేందుకు టీవీ తీసుకొచ్చారు. అయితే తనకు వ్యతిరేకంగా మీడియాలో కథనాలు రావడంతో మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం భార్య విజయలక్ష్మి వచ్చే సమయానికి బాగానే ఉన్న దర్శన్ మధ్యాహ్నం లాయర్ పరామర్శకు రాగా.. హై సెక్యూరిటీ జైలు నుంచి విజిటర్ రూంకు వస్తుండగా మీడియా కెమెరాలకు మధ్యవేలు చూపిస్తూ దురుసుతనం ప్రదర్శించినట్లు తెలిసింది. నిజానికి దర్శన్ వస్తున్నారన్న విషయం తెలిసి మీడియా కెమెరాలు అతన్ని ఫోకస్ చేశాయి. ఈ క్రమంలో పోలీసులతో నడుస్తూ తన రెండు చేతులను కదుపుతూ కుడి చేతి మధ్య వేలు చూపించి, కెమెరాలు తనపై ఫోకస్ చేయడంతో ఫేక్ స్మైల్ కూడా చేశాడు. దీంతో జైలులో ఉన్నా దర్శన్ కి కొవ్వు కరగలేదన్న భావనని కన్నడ మీడియా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.