పాకిస్థాన్ స్టార్ హీరో ఫవాద్ ఖాన్, బాలీవుడ్ నటి వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అబీర్ గులాల్ చుట్టూ మరోసారి గందరగోళం నెలకొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా భారతదేశంలో సెప్టెంబర్ 26, 2025న విడుదల కానుంది అనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ సమాచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పూర్తిగా ఖండించింది.
Also Read :OG : ‘ఓజీ’ నుంచి మరో సాంగ్ పై మేకర్స్ పోస్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పోస్టర్
PIB స్పష్టం చేస్తూ.. ఇప్పటి వరకు ఈ చిత్రానికి భారతదేశంలో విడుదల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఎటువంటి క్లియరెన్స్ లభించలేదని తెలిపింది. అందువల్ల, సినిమా విడుదలపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని పేర్కొంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, అబీర్ గులాల్ మే 9, 2025న భారతదేశంలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా ఏర్పడిన రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత ఈ చిత్రం భారతదేశాన్ని మినహాయించి ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 12, 2025న విడుదలైంది. ఈ నేపథ్యంలో, భారతీయ ప్రేక్షకులు కూడా త్వరలో ఈ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం ఉందన్న అంచనాలు మొదలయ్యాయి. కానీ PIB ఇచ్చిన స్పష్టీకరణతో ఆ ఊహాగానాలకు బ్రేక్ పడింది. మొత్తంగా, అబీర్ గులాల్ విడుదలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. సెన్సార్ క్లియరెన్స్ రాకపోతే, ఈ సినిమా ఇండియాలో ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేం.