నటరత్న యన్.టి.రామారావు, విశిష్ట నటి భానుమతి జంటగా నటించిన పలు చిత్రాలు జనరంజకంగా సాగాయి. వారిద్దరూ జంట కాకున్నా, కన్నులపండుగ చేస్తూ నటించిన సినిమాలున్నాయి. అలాంటి వాటిలో చారిత్రకాంశాల ఆధారంగా తెరకెక్కిన పురాణగాథ ‘సారంగధర’ కూడా చోటు సంపాదించింది. తెలుగునేలపై ‘సారంగధర’,’చిత్రాంగి’ పేర్లు విశేషంగా వినిపించడానికి ఈ కథయే కారణం! యన్టీఆర్ ‘సారంగధర’గా, భానుమతి ‘చిత్రాంగి’గా నటించిన ‘సారంగధర’ చిత్రం 1957 నవంబర్ 1న విడుదలై అలరించింది.
‘సారంగధర’ కథ ఏమిటంటే – వేంగి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజరాజ నరేంద్ర మహారాజుకు భార్య రత్నాంగి, తనయుడు సారంగధర ఉంటారు. రాజరాజ నరేంద్రుని కొలువులో మహామంత్రి సింగన్న, ఆయన కొడుకు సుబుద్ధి, నన్నయ్య భట్టారకుడు, మాండవ్యుడు ముఖ్యులు. సారంగధరునికి సుబుద్ధి, మాండవ్యునితో మంచి స్నేహం. తమ సామంత రాజయిన మంగరాజు కుమార్తె కనకాంగిని సారంగధరుడు ప్రేమిస్తాడు. ఇద్దరూ మనసులు ఇచ్చి పుచ్చుకుంటారు. తండ్రి ఆదేశంపై రంపసీమ ప్రభువు రంగనాథరాజుతో మైత్రికై వెళతాడు సారంగధర. దారిలో అతనికి రంగనాథరాజు కూతురు చిత్రాంగి తారసపడుతుంది. ఆమె అతనిపై మనసు పారేసుకుంటుంది. రంగనాథరాజుతో సంధి కుదిరాక, రాజరాజ నరేంద్రుడు పంపిన చిత్రపటాల్లో సారంగధరుని చూసి అతనితో వివాహానికి అంగీకరిస్తుంది చిత్రాంగి.
అయితే అప్పటికే తాను కనకాంగిని ప్రేమించి ఉండడం వల్ల సారంగధర ఆ వివాహానికి అంగీకరించడు. మంత్రి గంగన్న కుయుక్తితో కత్తికి కంకణం కట్టించి, చిత్రాంగికి పెళ్ళి జరిపిస్తాడు. వేంగి రాజ్యంలో అడుగుపెట్టే వరకు చిత్రాంగి సారంగధరుడే తన పతి అనుకుంటుంది. అయితే సంధి కారణంగా గొడవలు జరగరాదని రాజరాజ నరేంద్రుడు ఆమెను భార్యగా స్వీకరించవలసి వస్తుంది. తాను ఓ వ్రతదీక్షలో ఉన్నానని చిత్రాంగి, రాజరాజ నరేంద్రుని దగ్గరకు రానీయదు. ఓ పథకం వేసి, తన అంతఃపురానికి సారంగధరను రప్పిస్తుంది. అతనిపై వలపు కురిపిస్తుంది. సారంగధర అది తప్పని వారించి వస్తాడు. చిత్రాంగి మందిరంలో సారంగధర కత్తి, పాదరక్షలు చూసిన రాజరాజ నరేంద్రుడు అతను తప్పు చేశాడని భావించి, కాళ్ళు నరకమని ఆజ్ఞ ఇస్తాడు. కానీ, నిజానిజాలు తెలుసుకున్నాక శిక్ష ఆపాలనుకుంటాడు.
అప్పటికే సారంగధరపై శిక్ష అమలు చేసి ఉంటారు. అది తెలిసిన చిత్రాంగి, రాజరాజ నరేంద్రుని నిందిస్తుంది. ఆమె ఆత్మాహుతి చేసుకుంటుంది. రాజరాజ నరేంద్రుడు తానెంత తప్పు చేశాడో తెలుసుకుంటాడు. శివుడు ఓ సాధువు రూపంలో వచ్చి, సారంగధరుని జీవింప చేస్తాడు. తాను వలచిన కనకాంగిని పెళ్ళాడి, కన్నవారి ఆశీస్సులతో వేంగి రాజ్య సింహాసనం అధిష్టిస్తాడు సారంగధర. దాంతో కథ సుఖాంతమవుతుంది. ఇప్పటికీ రాజమండ్రిలో సారంగధర దేవాలయం ఉండడం గమనార్హం!
ఇందులో యస్వీ రంగారావు, శాంతకుమారి, రాజసులోచన, రేలంగి, చలం, గుమ్మడి, మిక్కిలినేని, ముక్కామల, సురభి బాలసరస్వతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సముద్రాల సీనియర్ మాటలు, పాటలు అందించారు. ఘంటసాల స్వరకల్పన చేశారు. ఇందులోని “అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మథుడు…”, “అన్నానా భామిని…”, “ఓ చిన్నవాడ… ఒక్కసారి నన్ను చూడు…”, “ఓ రాజా… ఇటు చూడవోయి…”, “జయ జయ మంగళ గౌరీ…”, “పోయిరా మాయమ్మ…”, “మనసేమో మాటలలో దినుసేమో…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఇందులో కొన్ని పద్యాలు సైతం చోటు చేసుకున్నాయి. వి.యస్. రాఘవన్ దర్శకత్వంలో టి.నామదేవ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదట్లో అంతగా అలరించని ఈ చిత్రం తరువాత జనాదరణ చూరగొనడం విశేషం!