Sir: గత యేడాది ‘భీమ్లా నాయక్’ మూవీతో తొలిసారి తెలుగువారి ముందుకు వచ్చింది సంయుక్త మీనన్. అదే సంవత్సరం ఆమె నటించిన ‘బింబిసార’ చిత్రమూ విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ద్విభాషా చిత్రం ‘సార్’తో తెలుగువారి ముందుకు ఈ నెల 17న మరోసారి రాబోతోంది. ఈ సందర్భంగా ఆమె తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. ”కాలేజీ రోజుల్లో సరదాగా ఓ సినిమాలో నటించినా… నటననను సీరియస్ గా తీసుకోలేదు. కేరళలోని పల్లెటూరిలో ఉండే నాకు నటనను కెరీర్ గా తీసుకోవాలనే ఆలోచన మొదట్లో కలగలేదు. ఆ తర్వాత ఒకే ఒక్క మంచి సినిమాలో నటించి ఇక ఆగిపోవాలని అనుకున్నాను. కానీ సినిమాతో ప్రేమలో పడిపోయాను. ఇదే నా కెరీర్ అనే నిర్ణయానికి వచ్చేశాను. అలా విధి నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చేసింది. అదృష్టంతో అవకాశాలు వచ్చినప్పుడు ఎవరూ పెద్దంత సీరియస్ గా తీసుకోరు. ఒకసారి ఇదే మన వృత్తి అని భావించిన తర్వాత కష్టపడటం మొదలు పెడతారు. నేనూ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాను. నాకిప్పుడు నటన అనేది దైవంతో సమానం. ఇదో ఆధ్యాత్మిక ప్రయాణంగా భావిస్తుంటాను” అని తెలిపింది.
తెలుగు సినీ రంగ ప్రవేశం గురించి చెబుతూ, ” ‘భీమ్లా నాయక్’ తెలుగులో విడుదలైన నా మొదటి సినిమా. నిజానికి దానికంటే ముందే ‘బింబిసార’, ‘విరూపాక్ష’ చిత్రాలకు సైన్ చేశాను. అందులో ‘బింబిసార’ కూడా లాస్ట్ ఇయర్ విడుదలై పోయింది. ఇప్పుడు ‘విరూపాక్ష’ షూటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో ‘సార్’ మూవీకి పిలుపు వచ్చింది. ఇందులోని లెక్చరర్ పాత్రకు నేను సరిపోతానని భావించి నాకు అవకాశం ఇచ్చారు. ఈ బ్యానర్ లోనే ‘భీమ్లా నాయక్’ చేయడం నాకు కలిసొచ్చింది. అప్పటి నుండే తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఇప్పుడు దానిని బాగా అర్థం చేసుకుంటున్నాను. ఇబ్బంది లేకుండా మాట్లాడేస్తున్నాను. ఇవాళ నన్ను సెట్ లో అంతా తెలుగు అమ్మాయిగానే భావిస్తుంటారు. అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ క్రెడిట్ అంతా నా ట్యూటర్ ఆశకు చెందుతుంది’ అని చెప్పింది. మొదటి రెండు సినిమాలలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని, కానీ ‘సార్’ మూవీ దగ్గరకు వచ్చే సరికీ ఇతర కమిట్ మెంట్స్ కారణంగా చెప్పుకోలేకపోయానని సంయుక్త తెలిపింది.
‘సార్’ చిత్రంలోని పాత్ర గురించి చెబుతూ, ”ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తీసిన సినిమానే అయినా… ఎక్కడా సందేశం ఇస్తున్నట్టుగా ఉండదు. పూర్తి స్థాయిలో అన్ని వర్గాలను అలరించేలా వినోదాత్మకంగా దర్శకుడు వెంకీ దీన్ని తీశారు. సినిమా చూస్తున్న క్రమంలోనే ప్రేక్షకులలో ఓ ఆలోచన కలుగుతుంది. నా పాత్రకు కూడా ఇందులో ఎంతో ప్రాధాన్యం ఉంది. సహజంగానే వెంకీ చిత్రాలలో మహిళల పాత్రలు బలంగా ఉంటాయి. అతనిలో ఓ రచయిత కూడా ఉండటం మరో ప్లస్ పాయింట్” అని తెలిపింది. ధనుష్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించడం ఆనందాన్ని కలిగించిందని చెబుతూ, ”ఆయనకు నేను పెద్ద ఫ్యాన్. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ధనుష్ సరసన అవకాశం రావడం అంటే మాటలు కాదు. ఆయన స్పాంటేనియస్ గా నటించేస్తారు. అంతేకాదు… చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అది నాకు బాగా నచ్చుతుంది” అని చెప్పింది. తాను కూడా స్పాంటేనియస్ గా నటించడానికే ఆసక్తి చూపిస్తానని, అయితే… పాత్రోచితంగా కట్టుబొట్టు, బాడీ లాంగ్వేజ్ విషయంలో కొంత హోమ్ వర్క్ చేస్తానని తెలిపింది. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆంధ్రా, తెలంగాణ పల్లెల్లోని మహిళలను గమనించానని చెప్పింది. ఓ సినిమా అంగీకరించేప్పుడు కథకు, తన పాత్రకే ప్రాధాన్యమిస్తానని, కంటెంట్ ప్రధానమైన చిత్రాలనే ఇవాళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అందుకు ఉదాహరణగా ‘లవ్ టుడే’, ‘రైటర్ పద్మభూషణ్’ను చెప్పుకోవచ్చని సంయుక్త తెలిపింది. తనను కొందరు సమంతలా ఉంటావని అంటారని, అయితే అందంలో కాకుండా నటన విషయంలో ఆమెతో పోల్చితే ఇంకా సంతోషిస్తానని, ‘ది ఫ్యామిలీ మ్యాన్’లో సమంత అద్భుతంగా నటించిందని సంయుక్త తెలిపింది. ఇంటి పేరుతోనూ, కులంతోనూ గుర్తింపును తాను కోరుకోనని, ఓ మనిషిగా, ‘సంయుక్త’గా తనను గుర్తిస్తే చాలని ఆమె చెప్పింది.