‘దళం’, ‘జార్జ్ రెడ్డి’తో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఆకాష్ పూరి హీరోగా తీసిన సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయిక. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ‘నా గత చిత్రాలైన దళం, జార్జ్ రెడ్డికి భిన్నంగా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో తీసిన చిత్రమిది. బ్లడ్ షెడ్ లేకుండా వినోదాత్మక సినిమా చేయాలని భావించే ఈ చిత్రాన్నితెరకెక్కించా. జార్జ్ రెడ్డి కంటే ముందు సిద్ధమైన కథ. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉంటుంది’ అన్నారు.
టైటిల్ గురించి మాట్లాడుతూ ‘చోర్ బజార్ కు వెళ్తుండేవాడిని. అక్కడ నేను చూసిన మనుషులు రాత్రంతా బిజినెస్ చేసి, పగలు నిద్రపోతుంటారు. పగలు ఓ జీవితం, రాత్రి మరో జీవితం గడుపుతుంటారు. ప్రతి ఒక్కరూ ఒక్కో హీరోను అభిమానిస్తారు. ఆ స్ఫూర్తితోనే మా చిత్రంలో హీరోకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టాం. పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటూ ఫుల్ కమర్షియల్ గా సాగుతుంటాయి. సినిమా ప్రధానంగా లవ్ స్టోరి అయినా ఓ విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతుంది. వంద కోట్ల విలువైన డైమండ్ చోర్ బజార్ లో ప్రత్యక్షమవుతుంది. కానీ అక్కడి వాళ్లకు దాని విలువ తెలియదు. ఈ డైమండ్ చుట్టూ డ్రామా, ఫన్ క్రియేట్ అవుతాయి. కథ చెప్పేందుకు పూరి జగన్నాథ్ ను కలిస్తే… రెండు సినిమాలు చేశావు కదా నువ్వు అనుకున్నట్లు తీయ్ అన్నారు. ఈ సినిమా తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడిస్తా’ అని చెబుతున్నారు జీవన్ రెడ్డి.