Site icon NTV Telugu

Jana Nayagan vs Parasakthi: “టీవీకే” జన నాయగన్ vs “డీఎంకే” పరాశక్తి.. రెండు సినిమాల మధ్య తమిళ రాజకీయాలు..

Jana Nayagan Vs Parasakthi

Jana Nayagan Vs Parasakthi

Jana Nayagan vs Parasakthi: తమిళనాడులో రెండు సినిమాల మధ్య అరవ రాజకీయాలు హీటెక్కాయి. తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’, శివకార్తికేయన్ నటించిన ‘‘పరాశక్తి’’ సినిమాల మధ్య వివాదం ముదురుతోంది. పొంగల్ బరిలో ఈ రెండు సినిమాలు నిలుస్తున్నాయి. విజయ్ లాస్ట్ సినిమా కావడంతో జన నాయగన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కావడం టీవీకే, డీఎంకే పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది. జన నాయగన్ జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది, అయితే పరాశక్తి జనవరి 10న థియేటర్లలోకి రానుంది. సెన్సార్ సర్టిఫికేట్ నుంచి ప్రారంభమైన ఈ వివాదం, ఇప్పుడు రాజకీయ ఘర్షణగా మారింది.

సెన్సార్ చిక్కులు:

జన నాయగన్ నిర్మాతలు తమ చిత్రం షెడ్యూల్ ప్రకారం జనవరి 9న విడుదల కావడానికి చాలా ముందుగానే, డిసెంబర్ 18న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు సమర్పించారు. CBFC చిన్న సవరణలను సూచించినప్పటికీ, చిత్రనిర్మాతలు వెంటనే అమలు చేయడానికి అంగీకరించినప్పటికీ, బోర్డు సర్టిఫికెట్ జారీ చేయలేదు. జనవరి 10న విడుదల కానున్న పరాశక్తి కూడా ఇదే విధమైన సమస్యను ఎదుర్కొంటోంది. రెండు సినిమాలు ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాయి. వీటి సర్టిఫికేషన్‌ ప్రక్రియను ముంబైలోని CBFC కార్యాలయానికి బదిలీ చేయబడిందని నివేదికలు చెబుతున్నాయి. రాజకీయ ప్రేరేపితంగా ఉండటంతోనే ఆలస్యమవుతోందనే వాదన ఉంది. ఈ వ్యవహారంపై జన నాయగన్ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

టీవీకే ‘‘జన నాయగన్’’, డీఎంకే ‘‘పరాశక్తి’’..

ఇది కేవలం సర్టిఫికేషన్ సమస్య మాత్రమే కాకుండా, అరవ రాజకీయాల్లో కీలక సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చిన సినిమాలుగా ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ రెండు సినిమాలు రాజకీయ కోణం కనిపిస్తోంది. టీవీకే అధినేత నటించిన చివరి చిత్రంగా ప్రాచుర్యం పొందున్న ‘‘జన నాయగన్’’ ఆయన రాజకీయ లక్ష్యాలను స్పష్టంగా తెలియజేస్తోంది. సామాన్య వ్యక్తి వ్యవస్థలోని లోపాలకు ఎదురుతిరిగే క్యారెక్టర్‌గా, మహిళ హక్కుల గురించి ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ‘‘పరాశక్తి’’ లో కూడా రాజకీయ కోణం లేకపోలేదు. 1960లలో ‘‘హిందీ’’కి వ్యతిరేకంగా పెరియార్,డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తారు. ఆ సమయంలో చెరియన్ అనే రియల్ క్యారెక్టర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్‌ను శివకార్తికేయన్ పోషిస్తున్నారు. డీఎంకే రాజకీయ సిద్ధాంతంగా హిందీ వ్యతిరేకత ఉంది. దీనికి తోడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రెడ్ జాయింట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తోంది. దీంతో తమిళనాడులో ఈ రెండు సినిమాలు, రాజకీయ అస్త్రాలుగా మారాయి.

Exit mobile version