Jiah Khan Suicide Case: బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో రేపు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రేమ వ్యవహారంతో ముడిపడి ఉన్న ఈ ఆత్మహత్య కేసు 2013లో సంచలనం రేపింది. జూన్ 3, 2013లో ముంబైలోని తన ఇంట్లో నటి జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలి, జరీనా వహాబ్ ల కుమారుడు, బాలీవుడ్ నటుడు అయిన సూరజ్ పంచోలీ ఈ ఆత్యహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జుహూలో తన ఇంట్లో ఉరేసుకుని మరణించిన జియాఖాన్, సూరజ్ పంచోలిపై 6 పేజీల లేఖలో ఆరోపించింది. ఈ లేఖలో ప్రేమ పేరుతో సూరజ్ పంచోలి తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసిన విషయాలను ప్రస్తావించింది. పలుమార్లు గర్భం దాల్చినట్లు, అబార్షన్లు చేసుకున్నట్లు కూడా ప్రస్తావించింది.
సీబీఐ ఈ కేసును ముంబై పోలీసుల నుంచి తీసుకుని దర్యాప్తు చేసింది. ఇరు పక్షాల వాదనలు ముగిసిన తర్వాత సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ గతవారం ఈ కేసు తీర్పును ఏప్రిల్ 28కి రిజర్వ్ చేశారు. ఈ కేసులో కీలక సాక్షిగా జియాఖాన్ తల్లి రుబియా ఖాన్.. తన కూతురిది ఆత్మహత్య కాదని, హత్య అని వాదిస్తోంది. ఈ కేసును తాజాగా విచారణ జరపాలని ఆమె వేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు గతేడాది కొట్టేసింది. జియా ఖాన్ ను సూరజ్ పంచోలీ శారీరంకగా, మానసికంగా వేధించాడని సీబీఐ కోర్టుకు ఆమె తెలిపింది. తన కూతురు ఆత్మహత్య చేసుకుందని నిరూపించేందుకు పోలీసులు, సీబీఐ చట్టపరమైన ఆధారాలు సేకరించలేదని ఆమె ఆరోపించారు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘నిశ్శబ్ద్’ చిత్రంలో జియా ఖాన్ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.