బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ అన్న మాటకు అసలైన అర్థం చెప్పిన మహానటులు తెలుగునాట యన్టీఆర్, ఏయన్నార్ అనే చెప్పాలి. వారిద్దరూ తెలుగు బాక్సాఫీస్ ను ఓ వెలుగు వెలిగించారు. ఈ రోజున అందరూ తమ చిత్రాలు ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయని గర్వంగా చెప్పుకుంటూ సాగుతున్నారు. కానీ, ఆ మాటకు అసలు సిసలు అర్థం చెప్పిన వారు కూడా ఆ ఇద్దరు మహానటులే! ఇక అసలు విషయానికి వస్తే, యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో పలుమార్లు పోటీ పడ్డాయి. ఓ రోజు యన్టీఆర్ సినిమా ముందు వస్తే, మరుసటి రోజున ఏయన్నార్ సినిమా రావడం, లేదా ఈయన సినిమా ముందు వస్తే, ఆయన సినిమా తరువాత రావడం జరిగాయి. కానీ, ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు రెండే రెండు సార్లు చోటు చేసుకున్నాయి. ఆ రెండు సంఘటనలు 1967లోనే చోటు చేసుకోవడం విశేషం! సరిగ్గా 55 ఏళ్ళ క్రితం యన్టీఆర్ ‘భువనసుందరి కథ’, ఏయన్నార్ ‘గృహలక్ష్మి’ చిత్రాలు 1967 ఏప్రిల్ 7న విడుదలయ్యాయి.
సి.పుల్లయ్య దర్శకత్వంలో తోట సుబ్బారావు ‘భువనసుందరి కథ’ను నిర్మించగా, ‘గృహలక్ష్మి’ చిత్రాన్ని భానుమతి, ఆమె భర్త పి.రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల్లో యన్టీఆర్ సినిమా జానపదం, ఏయన్నార్ చిత్రం హాస్యప్రధానమైన కుటుంబకథాచిత్రం. జనానికి బాగా పరిచయమైన ‘భువనసుందరి కథ’ చిత్రం విజయం సాధించగా, ‘గృహలక్ష్మి’ సినిమా పరాజయం పాలయింది.
అదే సంవత్సరం ఆగస్టులో మరోమారు యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలు ఒకే రోజున పోటీపడ్డాయి. అప్పుడు యన్టీఆర్ సినిమా ‘నిండుమనసులు’ సాంఘికం కాగా, ఏయన్నార్ ‘వసంతసేన’ చిత్రం జానపదం. ‘నిండుమనసులు’ చిత్రానికి ‘ఫూల్ ఔర్ పత్తర్’ చిత్రం ఆధారం కాగా, శూద్రకుడు రాసిన సుప్రసిద్ధ సంస్కృత నాటకం ‘మృచ్ఛకటికం’ ఆధారంగా ‘వసంతసేన’ రూపొందింది. బి.యస్.రంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ‘వసంతసేన’ రంగుల్లో రూపొందింది. యస్.డి.లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిండు మనసులు’ బ్లాక్-అండ్ వైట్ మూవీ. ‘నిండు మనసులు’ చిత్రాన్ని 1967 ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ సినిమా కన్నా ఓ రోజు అంటే ఆగస్టు 10న ‘వసంతసేన’ విడుదల చేయాలని తలంచారు. అయితే ‘వసంతసేన’ కలర్ మూవీ కాబట్టి, అప్పట్లో ఆ సినిమా కలర్ ప్రింట్ వేయడంలో జాప్యం జరిగింది. అందువల్ల ‘వసంతసేన’ ఓ రోజు ఆలస్యంగా అంటే 1967 ఆగస్టు 11వ తేదీన కొన్ని కేంద్రాలలో, ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 12న మరికొన్ని కేంద్రాలలో విడుదలయింది. అలా యన్టీఆర్ ‘నిండుమనసులు’తో ఏయన్నార్ ‘వసంతసేన’ అనివార్యంగా ఒకే రోజు విడుదలై పోటీ పడవలసి వచ్చింది. ‘నిండుమనసులు’ మంచి విజయం సాధించగా, రంగుల్లో రూపొందిన ‘వసంతసేన’ పరాజయాన్ని చవిచూసింది.
ఆ తరువాత యన్టీఆర్, ఏయన్నార్ ఎప్పుడూ ఒకే రోజున తమ చిత్రాలను విడుదల చేసుకోలేదు. అంతకు ముందు లాగే, ఓ రోజు ముందూ వెనుకగా తమ చిత్రాలను విడుదల చేసుకొనేవారు. అలా విడుదలైన వారి చిత్రాలలో ఓ సారి యన్టీఆర్, మరో సారి ఏయన్నార్ సినిమాలు పై చేయి అయిన సందర్భాలున్నాయి.