అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఓ మెతుకు పట్టుకుంటే చాలు! డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా మొదలైన ‘బిగ్ బాస్ – నాన్ స్టాప్’ షో కంటెస్టెంట్స్ ను చూడగానే ఇది ఆకట్టుకునే కార్యక్రమం కాదనేది వీక్షకులకు అర్థమైపోయింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, ఆరేడు వారాల లోపే బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ను తిరిగి తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో నిర్వాహకులకే తెలియాలి. బహుశా వీరంతా బయట ఖాళీగా ఉండిపోయారని వారికో చాన్స్ ఇచ్చారేమో అనిపిస్తోంది. వీరిని ‘వారియర్స్’ అనే ట్యాగ్ లైన్ తో హౌస్ లోకి తీసుకొస్తే, ముక్కూ ముఖం తెలియని మరి కొందరిని ఛాలెంజర్స్ పేరుతో రంగంలోకి దింపారు. ఈ రెండు గ్రూప్స్ మధ్య టాస్క్ లు పెడుతూ, వినోదం చూడండంటూ వీక్షకుల మీదకు వదిలారు. వారియర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారు వ్యూవర్స్ ను ఆకట్టుకున్న వారూ కాదు. ఆ మధ్య ఇంటర్వ్యూలలో వీళ్లందరినీ ‘మళ్ళీ బిగ్ బాస్ షో లో ఛాన్స్ వస్తే వెళతారా?’ అని ఎందుకు అడిగారో ఇప్పుడు అర్థమైంది. అలా ఆసక్తి ఉన్న వారి లిస్ట్ చేసుకుని, అందులో కొందరిని ఈ షోకు ఆహ్వానించారు. ఇక చాలెంజర్స్ గ్రూప్ మెంబర్స్ అయితే మరీ దారుణం. ఠక్కున అందులో నలుగురి పేర్లు చెప్పమంటే చెప్పలేని పరిస్థితి. ‘స్టార్ మా’లో ప్రసారం అయినప్పుడు బిగ్ బాస్ షోలో పాల్గొన్న చాలామంది కంటెస్టెంట్స్ గురించి జనం పెదవి విరిచేవారు. ఇక ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుండటంతో… నెంబర్ కు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప ఎంపిక చేసిన మెంబర్ కు ఉన్న విలువ ఏమిటనేది చూసినట్టుగా లేదు. ఇక పాత వారే ఉండటంతో ఇదేదో పాత స్టఫ్ మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారేమో అనేవారు లేకపోలేదు.
ఇదిలా ఉంటే… కొద్దో గొప్పో జనంలో క్రేజ్ ఉన్న ముమైత్ ఖాన్ ను మొదటి వారంలోనే ఎలిమినేట్ చేసేసి బిగ్ బాస్ ఘోరమైన తప్పు చేశాడనిపిస్తోంది. ఆమె కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని కావాలనే సేవ్ చేశారనేది తెలిసిపోతోంది. బహుశా దీని మీద సోషల్ మీడియా చర్చ జరిగి తద్వారా ఈ షోకు ప్రచారం తెచ్చుకోవాలని నిర్వాహకులు భావించారేమో తెలియదు.
అలానే బిగ్ బాస్ షో పట్ల గతంలోనే అనేకానేక విమర్శలు ఉండేవి. ఇప్పుడు ఓటీటీలో ప్రసారం కావడంతో షోలో కంటెస్టెంట్స్ మాటలకు, చేతలకు అదుపు లేకుండా పోయింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు చీప్ బాడీ లాంగ్వేజ్ తో చెవులు, కళ్లు మూసుకునేలా చేశారు. దాంతో ఈసారి కూడా విమర్శకులు గట్టిగానే విరుచుకు పడ్డారు. బహుశా అందుకే కావచ్చు… లైవ్ షో అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి, ఆ పైనా రెండు మూడు రోజులకే నాలుక కరుచుకుని ఓ రోజు మొత్తం షో నిలిపి వేశారు. చివరకు లైవ్ ఎపిసోడ్ ను కొన్ని గంటల ఆలస్యంగా, మొత్తం 24 గంటల కంటెంట్ ను ఒక గంటకు కుదించి ప్రతి రోజు రాత్రి 9 గంటలకూ స్ట్రీమింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా బూతులు మాట్లాడితే మ్యూట్ చేయడం, మరీ వల్గర్ గా బిహేవ్ చేస్తే దానిని ఎడిట్ చేస్తున్నారట.
చిత్రం ఏమంటే… గంట కంటెంట్ కే చూసే దిక్కులేదంటే… ఇక ఇరవై నాలుగు గంటల లైవ్ చూసేది ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది! దీనికి తోడు వ్యాఖ్యాత అక్కినేని నాగార్జున ఫస్ట్ వీకెండ్ లో ‘ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్… ఏ షోకు రానంత హయ్యెస్ట్ వ్యూవర్ షిఫ్ బీబీ నాన్ స్టాప్ కు వచ్చింది’ అని ప్రకటించారు. ఆయన మాటలు విని అవాక్కుకాని వీక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ‘ఇంత దరిద్రమైన షోకు హయ్యెస్ట్ వ్యూవర్ షిప్ ఏమిటీ? నాగార్జున మాటలు కోటలు దాటేస్తున్నాయి’ అనే కామెంట్స్ విపరీతంగా వినిపించాయి. అంతేకాదు… ‘గ్రాండ్ జోక్ ఆఫ్ ది ఇయర్’ అంటూ మరికొందరు కామెడీ చేసేశారు. మొదటి వారమే ఇంత దారుణంగా ఉంటే 84 రోజుల ఈ షోను మున్ముందు ఎలా నడుపుతారనే అనుమానం చాలామందికి కలుగుతోంది. కొత్త కాన్సెప్ట్ అంటూ మొదలు పెట్టారు కాబట్టి… ఎలాగోలా సో.. సో… గా షోను నడిపేస్తారా? లేకపోతే పట్టుదలకు పోకుండా చేసిన తప్పును దిద్దుకుంటూ మధ్యలోనే శుభం కార్డు వేస్తారా? అనేది చూడాలి.