Bhuvanchandra’s Birthday Special : తెలుగు చిత్రసీమ పాటల తోటలో సదా వెన్నెల కురిపించే మహత్తు గల కలాలు కొన్నే! వాటిలో భువనచంద్రుని కలం బలంగా వెన్నెల కురిపిస్తూనే ఉంటుంది. తత్ర్పభావంతో మరెందరో గీత రచయితలు ఆ వెలుగులో తమ రచనలకు మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. సందర్భం వివరిస్తే చాలు లోతుగా భావాన్ని పలికించే సత్తా భువనచంద్ర సొంతం. నేరుగా రూపొందే చిత్రాలలోనే కాదు అనువాదాల్లోనూ అదరహో అనేలా తనదైన శైలి ప్రదర్శించారు భువనచంద్ర. కొన్నిసార్లు మాతృకలోని పాటకన్నా మిన్నగా భువనచంద్రుని సాహితీవెన్నెల వెలుగులు విరజిమ్మేది. ఆయన పాటతో ఒక్కసారి ప్రయాణం చేసిన వారు మళ్ళీ మళ్ళీ భువనచంద్రుని పాళీ పరుగుల కోసమే తపించేవారు. అదీ భువనచంద్రుని కవితా వెన్నెల వైశిష్ట్యం!
కృష్ణాజిల్లా గుల్లపూడిలో 1949 ఆగస్టు 17న భువనచంద్ర జన్మించారు. అయితే ఆయన పెరిగిందీ, చదివిందీ మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో. చిన్నప్పటి నుంచీ పుస్తకాల పురుగు అనిపించుకున్నారు. లైబ్రరీకి వెడితే అన్నపానీయాలు మరచి, అది మూసేదాకా అలాగే చదువుకుంటూ ఉండిపోయేవారు భువనచంద్ర. తరువాత తనకు నచ్చిన కవితలను రాసుకుంటూ ఆనందించేవారు. చదువయ్యాక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. దాదాపు 18 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ లో పనిచేయడం వల్ల ఉత్తరాది భాషలతో పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా హిందీ, ఉర్దూ కవిత్వం ఆయనను ఆకట్టుకున్నాయి. తన కవితలను హిందీ, ఉర్దూ భాషల్లోకి అనువదించుకొని మురిసిపోయేవారు. ఆ పంథాయే తరువాతి రోజుల్లో భువనచంద్ర గీత రచయితగా అలరించడానికి పనిచేసింది. ఆయన ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తూండగానే 1971లో భారత్-పాక్ యుద్ధం సంభవించింది. ఆ సమయంలో నాలుగు పతకాలు కూడా భువనచంద్రను వరించాయి.
ఎయిర్ ఫోర్స్ నుండి బయటకు వచ్చాక, తనకెంతో ఇష్టమైన కవిత్వంతోనే జీవనయానం సాగించాలని తపించారు భువనచంద్ర.
కొందరు మిత్రుల ద్వారా పలువురు దర్శకులను కలుసుకున్నారు. దర్శకుడు విజయబాపినీడు భువనచంద్రలోని సాహిత్యాన్ని ముందుగా పసికట్టారు. తన నిర్దేశకత్వంలో రూపొందిన `నాకూ పెళ్లాం కావాలి` చిత్రంలో తొలిసారి భువనచంద్రతో పాటలు రాయించారు విజయ బాపినీడు. అందులో భువనచంద్ర రాసిన “వినోదాల విందురా…“ పాట మంచి ఆదరణ పొందింది. ఆపై బాపినీడు సినిమా `మా ఇంటి మహరాజు`లో “అందాల హరివిల్లు మా బొమ్మరిల్లు…“ పాటతోనూ మరింత పేరు సంపాదించారు. చిరంజీవి హీరోగా విజయబాపినీడు తెరకెక్కించిన `ఖైదీ నంబర్ 786`లో భువనచంద్ర రాసిన పాటలన్నీ భలేగా మురిపించాయి. ముఖ్యంగా “గువ్వా గోరింకతో…“ పాట అప్పట్లో జనాన్ని ఓ ఊపు ఊపేసింది. `ప్రాణస్నేహితులు` చిత్రం కోసం ఆయన రాసిన “స్నేహానికన్న మిన్న లోకాన లేదురా…“ అంటూ సాగే గీతం ఈ నాటికీ స్నేహితుల దినోత్సవాన ఎక్కడో ఓ చోట జనాన్ని పలకరిస్తూనే ఉంటుంది. అలా జనం మెచ్చే పాటలు రాసుకుంటూ అనతికాలంలోనే వందల పాటలు రాసేశారు భువనచంద్ర. ఇప్పటి దాకా ఆయన కలం నుండి రెండు వేలకు పైగా పాటలు చిందులు వేస్తూ, జనానికి వీనులవిందులు చేశాయి. వారితో చిందులూ వేయించాయి.
భువనచంద్ర పలికించిన పాటలు తరువాతి రోజుల్లో రీమిక్స్ అయి అలరించడం విశేషం! `ఘరానామొగుడు`లోని “బంగారు కోడి పెట్ట…“ పాట ఆ పై `మగధీర`లో ప్రత్యక్షమయింది. `గ్యాంగ్ లీడర్`లోని “వానా వానా వెల్లువాయె…“ సాంగ్ `రచ్చ`లో రీమిక్స్ అయింది. `రౌడీ ఇన్ స్పెక్టర్`లోని `అరియో సాంబా…“ పాట `పటాస్`లో రీమిక్స్ గా దర్శనమిచ్చింది. `ఖైదీ నంబర్ 786`లో “గువ్వా గోరింకతో…“ సాంగ్ `సుబ్రమణ్యం ఫర్ సేల్`లో రీమిక్స్ అయింది. ఇలా భువనచంద్ర పాటలు నవతరాన్ని సైతం అలరించేలా రూపొందాయి. స్ట్రెయిట్ మూవీస్ లో ఎంతలా అలరించే కవిత్వం చిలికించారో, డబ్బింగ్ సినిమాల్లోనూ భువనచంద్ర పాటలు అంతలా ఆకట్టుకున్నాయి. ఈ నాటికీ తన దరికి చేరిన అవకాశాలకు న్యాయంచేయాలని తపిస్తూనే ఉన్నారు భువనచంద్ర. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.