Bellamkonda Ganesh:ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు గణేశ్ ‘స్వాతిముత్యం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్న గణేశ్ తన మొదటి సినిమా విజయం పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాడు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘స్వాతిముత్యం’ను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. వర్ష బొల్లమ్మ నాయికగా నటించింది. ఈ మూవీ గురించి గణేశ్ మాట్లాడుతూ, ”ప్రస్తుతం కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు. తర్వాత ఓటీటీలో చూడొచ్చులే అనుకుంటున్నారు. అందుకే నేను కొత్తదనం ఉన్న కథ కోసం వెతుకుతుండగా లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పారు. దీనితో వస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మి, ఈ కథను సితార వారి దగ్గరకు తీసుకెళ్ళాం. నాగ వంశీ గారికి కూడా ఇది నచ్చింది. తమ బ్యానర్ లో చేస్తే మంచి సినిమా అవుతుందని భావించిన ఆయన ఎక్కడా రాజీ పడకుండా దీనిని నిర్మించారు” అని అన్నాడు.
సినిమా రంగం తనకు కొత్త కాకపోయినా నటన కొత్తేనని చెబుతూ, ”సినిమా రంగం, సినిమా సెట్స్ నాకు కొత్త కాదు. ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్న అనుభవం ఉంది. మొదటి నుంచి సినిమా రంగంలోనే ఉండాలి, ఇక్కడే ఏదో ఒకటి చేయాలని అనుకునేవాడిని. తెర వెనుక ప్రొడక్షన్ వ్యవహారాలు అలవాటే గానీ కెమెరా ముందు నటించడం ఇదే మొదటిసారి. అయితే ముందే నటనలో శిక్షణ తీసుకోవడం, అన్ని విషయాల గురించి తెలుసుకోవడం వల్ల చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. నా మొదటి సినిమాకే రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, సుబ్బరాజు, ప్రగతి, సురేఖా వాణి గార్ల వంటి పెద్దలతో, ఎంతో ప్రతిభ, అనుభవమున్న నటీనటులతో పని చేయడం అదృష్టం. వారితో కలిసి పని చేయడం వల్ల నా నటన మెరుగుపడింది” అని చెప్పాడు. తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదని తెలుపుతూ, ”అలా ప్రత్యేకంగా ఏం లేదు. అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కానీ రాజమౌళి గారి సినిమాలో నటించాలనుంది. బేసికల్ గా నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలు చూడటం ఇష్టం. కానీ చేయడం మాత్రం అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. నా మొదటి పది సినిమాలు పది విభిన్న జానర్స్ లో చేయాలి అనుకుంటున్నాను” అని తెలిపాడు.
ఆగిపోయిన తన తొలి చిత్రం గురించి మాట్లాడుతూ, ”పవన్ సాధినేని గారి డైరెక్షన్ లో ఓ సినిమా ప్రారంభించాం. ఆ కథ కూడా చాలా బాగుంటుంది. అమెరికాలో కొన్ని రోజులు చిత్రీకరణ చేయాల్సి ఉంది. కానీ ఆ సమయంలోనే కరోనా రావడంతో అప్పుడు ఆ చిత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికైనా దర్శక నిర్మాతలు పిలిస్తే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక నా మరో సినిమా ‘నేను స్టూడెంట్’ థ్రిల్లర్ జానర్ కు చెందింది. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయింది. మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అని అన్నాడు. చిన్నప్పటి నుండి వెంకటేశ్ చిత్రాలను తానెక్కువగా చూసేవాడినని, అలానే మంచి కథ, నటనకు ప్రాధాన్యమున్న పాత్ర లభిస్తే.. తన అన్నయ్యతో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని గణేశ్ తెలిపాడు. ఇక చిరంజీవి, నాగార్జున వంటి పెద్ద స్టార్స్ సినిమాలతో పాటే తన చిత్రం విడుదల కావడం కాస్తంత ఆందోళన కలిగిస్తోందని, అయితే.. వారి సరసన తన సినిమా పోస్టర్ కూడా ఉండటం ఆనందంగా ఉందని గణేశ్ చెప్పాడు.