ఓ టాప్ హీరో సినిమా అంటే చాలు… ట్రైలర్ లో కావలసినంత కాల్పులు, లెక్కలేనన్ని కత్తులు కటార్లు, పొడుచుకోవడం, చంపుకోవడం, రక్తసిక్తం- ఇలాంటి అంశాలన్నీ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మధ్య ఇది కామన్ అయిపోయింది. తమిళ టాప్ స్టార్ విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ట్రైలర్ కూడా ఇలాగే రూపొందింది. కొత్తదనమేమీ కనిపించదు. మూడు రోజుల క్రితం తమిళంలో సందడి చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు తెలుగులోనూ అనువాదపు పలుకులతో అలరించే ప్రయత్నం చేస్తోంది.
విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో కళానిధి మారన్ ‘బీస్ట్’ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ చూస్తే, కొందరు టెర్రరిస్టులు ఓ షాపింగ్ మాల్ ను తమ అదుపులోకి తీసుకున్నట్టు, అదే మాల్ లో ఉన్న హీరో వారిని చితకబాది జనాన్ని రక్షించినట్టు తెలిసిపోతోంది. ఇందులో పూజా హెగ్డే నాయికగా నటించింది. ఆమె పాత్ర ట్రైలర్ లో అంతగా కనిపించలేదు. కానీ, కమెడియన్ యోగిబాబుతో హీరో, “భయంగా ఉందా? దీని తరువాత ఇంకా భయంకరంగా ఉంటుంది…” అని చెప్పినప్పుడు యోగిబాబు చూసిన చూపు నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్ పైకి ఇదే హైలైట్ అనుకోవాలి. మిగతాదంతా పాత వాసనే!
ఇంతేనా?… అనుకోకండి. విజయ్ డైలాగ్స్ వింటే, అతను పోషించిన వీరరాఘవన్ పాత్రకు రాజకీయాలంటే ఏ మాత్రం ఇష్టం లేదని తెలిసిపోతోంది. ఓ చోట రాజకీయ నాయకుల ప్రస్తావన కూడా తెచ్చి, “మీరు చేసే ఈ రాజకీయ ఆటలంతా నాకు సెట్ అవ్వవు… బికాజ్ ఐ యామ్ నాట్ ఏ పొలిటీషియన్…” అని చెప్పే డైలాగ్స్ లోనే అసలు కథ దాగుందనిపిస్తోంది. పైగా తమిళనాట విజయ్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. కొంతకాలం కిందట విజయ్ తండ్రి ప్రముఖ దర్శకులు ఎస్.ఏ.చంద్రశేఖర్ స్వయంగా తన కొడుకు రాజకీయాల్లోకి వస్తాడని ప్రకటించారు. అదీగాక, తమిళనాట పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యే నటులు, తమ చిత్రాలలో కుల్లు రాజకీయాలను ప్రక్షాళన చేసిన కథలతో సందడి చేయడమూ కొత్తకాదు. ఈ నేపథ్యంలో ఆలోచిస్తే ఈ ‘బీస్ట్’లో పొలిటికల్ సెటైర్ కూడా ఉందని అనిపిస్తోంది. ఏప్రిల్ 13న జనం ముందు నిలవబోతున్న ‘బీస్ట్’ మరి ఎలా అలరిస్తుందో చూడాలి.