మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. జీవిత, హేమ పోటీ నుంచి తప్పుకొని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరడంతో.. బండ్ల గణేష్ తన మద్దతు యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. జీవితపై తను పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తా.. అంటూ బండ్ల బయటకు వచ్చాడు. ఇదిలావుంటే, ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో నిన్న సమావేశయ్యారు. ఆదివారం ‘మా’ సభ్యులందరిని విందుకు ఆహ్వానం కూడా పంపారు. దీంతో బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ట్వీటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ప్రకాశ్ రాజ్ ‘మా’ సభ్యులను విందుకు ఆహ్వానించడంపై బండ్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘గత రెండేళ్లలో అందరు కరోనా భయంతో బ్రతుకుతున్నారు.. చాలా మంది నాలాగే కరోనాతో చావు దాకా వెళ్లొచ్చారు. ఇటువంటి సమయంలో సినీకళాకారులందరిని విందు పేరుతో ఒక దగ్గరకు చేర్చొద్దు. ఓటు కావాలంటే ఫోన్ చేసి.. మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి ప్రాణాలతో చెలగాటమడోద్దని నా మనవి’ అంటూ బండ్ల గణేష్ తెలిపారు.