పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉండరు కేవలం భక్తులే ఉంటారు. అందులో నిర్మాత బండ్ల గణేష్ పరమ భక్తుడు.. పవన్ ని దేవుడిలా కొలిచే బండ్లన్నకు పవన్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లో బండ్లన్నా ఇచ్చే మాస్ స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కొంతమంది కేవలం బండ్ల స్పీచ్ వినడానికే వచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇటీవల భీమ్లా నాయక్ ఫంక్షన్ కి బండ్లన్న రాలేదన్న సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ లో బండ్ల గణేష్ మాస్ స్పీచ్ ని మిస్ అయ్యినట్లు చాలామంది అభిమానులు బాహాటంగానే చెప్పుకొచ్చారు. అయితే.. భీమ్లా ఈవెంట్ మిస్ అయితే ఏంటి.. జనసేన పార్టీ మీటింగ్ లో మాట్లాడుకుందాం అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మార్చి 14న పవన్ తన పార్టీ జనసేన ఆవిర్భావ దినోత్సవ భారీ మీటింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మీటింగ్ కి బండ్ల గణేష్ హాజరవనున్నాడు.. ఈ విషయాన్నీ బండ్ల ట్వీట్ చేస్తూ.. ” వీరులారా ధీరులారా,జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం” అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ మీటింగ్ లో బండ్లన్న మాస్ స్పీచ్ ఇస్తాడా…? ఈ మీటింగ్లో కేవలంగా అభిమానిగా వెళ్తున్నాడా? లేక స్టేజీ ఎక్కి పవన్ ఫ్యాన్స్ మిస్ అవుతున్న మాస్ స్పీచ్ ను దంచి కొట్టి దుమారం రేపుతాడా? అన్నది చూడాలి అంటున్నారు అభిమానులు.