ఆగస్ట్ 30, 1974న నందమూరి బాలకృష్ణ నటించిన తొలి చిత్రం ‘తాతమ్మకల’ విడుదలైంది. నటరత్న నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాతమ్మకల నెరవేర్చే మనవడిగా బాలకృష్ణ నటించాడు. సో… ఈ రోజుకు బాలకృష్ణ తెరపై కనిపించి 48 సంవత్సరాలు అయినట్టు. విశేషం ఏమంటే… ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రాణిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 107వ సినిమా షూటింగ్ టర్కీలోని ఇస్తాంబుల్ లో జరుగుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ నాయిక. ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ కోసం అక్కడకు వెళ్ళిన తర్వాత లొకేషన్ లో బాలకృష్ణ, శ్రుతీహాసన్ తో సెల్ఫీ దిగి దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టాకీ పార్ట్ కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.