తెలుగు ఇండియన్ ఐడల్ షో చివరి దశకు చేరుకుంది. ‘రేస్ టు ఫినాలే’లో ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వాగ్దేవి, వైష్ణవి, లాలస, ప్రణతి, ధరిమిశెట్టి శ్రీనివాస్, జయంత్ సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు. అన్నపూర్ట స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఆదివారం రేస్ టు ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఎపిసోడ్ కు గెస్ట్ గా మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో యువతను ఊపేసిన ఉషా ఊతప్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
టాప్ 6 సింగర్స్ లో అన్ స్టాపబుల్ ఎపిసోడ్!
తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు కావడం విశేషం. మహానటుడు, నటరత్న నందమూరి తారకరామారావు శతజయంతి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఎపిసోడ్ లో ఎన్టీయార్ పాటలకు ప్రాధాన్యమిచ్చారు. ఆదివారం ఉదయం చిలకలూరి పేటలో ‘అఖండ’ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు హాజరైన బాలకృష్ణ, అక్కడ నుండి నేరుగా తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”’ఆహా’ సంస్థ మొదటిసారి తెలుగులో ఇండియన్ ఐడల్ ను నిర్వహిస్తోంది. ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ షోను చూస్తున్నాను. కంటెస్టెంట్స్ బాగా పాడుతున్నారు. సెమీ ఫైనల్స్ కదా… కొందరు షివరింగ్ అవుతున్నట్టు తెలిసింది. వారిని సెట్ చేద్దామని నేనొచ్చాను” అని అన్నారు. ఈ ఎపిసోడ్ లోనే బాలకృష్ణ తన అభిమానులకు ఓ తీపి కబురు చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.
లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్!
వేలాది మంది హాజరైన తెలుగు ఇండియన్ ఐడల్ లో టాప్ సిక్స్ పొజిషన్ కు చేరుకోవడం పట్ల కంటెస్టెంట్స్ వాగ్దేవి, వైష్ణవి, లాలస, ప్రణతి, శ్రీనివాస్, జయంత్ హర్షం వ్యక్తం చేశారు. సెమీ ఫైనల్స్ కు బాలకృష్ణ రావడం ఆనందంగా ఉందన్నారు. అలానే చాలా హోమ్లీ ఎట్మాస్ఫియర్ లో తెలుగు ఇండియన్ ఐడిల్ జరగడం పట్ల న్యాయనిర్ణేతలు తమన్, కార్తీక్, నిత్యా మీనన్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఎన్టీయార్ కథానాయకుడు’ మూవీ తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని నిత్యా మీనన్ తెలిపింది. తొలిసారి హోస్ట్ గా చేస్తున్న తాను ఈ మొత్తం ప్రక్రియను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని సింగర్ శ్రీరామచంద్ర చెప్పాడు.
గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా మెగాస్టార్!
తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఐదుగురు కంటెస్టెంట్స్ తో పలు దఫాలుగా ఈ ఎపిసోడ్ జరుగనుంది. అందులో తొలుత ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఆ తర్వాత టాప్ త్రీ కంటెస్టెంట్స్ మధ్య పోటీని నిర్వహిస్తారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ కు చిరంజీవితో పాటు ఆయన సరసన హీరోయిన్లుగా నటించిన ఐదుగురు అందాల కథానాయికలు సైతం ఈ గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటారని అంటున్నారు. మొత్తం మీద మరో మూడు వారాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ విజేత ఎవరు అనేది తెలిసిపోతుంది!