Pawan Kalyan: నటుడు పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారన్న విషయం ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. పవన్ పై ఎలాంటి విమర్శలు వచ్చినా, ఆయనకు ఎన్ని అపజయాలు ఎదురైనా, అసలు ఆయన ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఆ అభిమానులు అలాగే ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టిపెట్టిన విషయం విదితమే. ఇక పవన్ కు అభిమానులే బలం అనేది అందరికి తెల్సిందే. కొన్నిసార్లు వారి భక్తి చూసి ఇంత అభిమానం ఉంటుందా అని అనుకోకుండా ఉండలేరు. తాజాగా పవన్ అభిమానులు చేసిన ఒక పని అందరిని ఔరా అని అనిపిస్తోంది. దేవుళ్ళకు ఎంతో భక్తితో చేపట్టే దీక్షను .. పవన్ కోసం అభిమానులు చేపట్టారు. అదే పవన్ మాల. ఇప్పటివరకు అయ్యప్ప మాల, ఆంజనేయ మాల, దుర్గామాత మాల విని ఉంటారు.. ఇక పశ్చిమ గోదావరిలోని పాలకొల్లుకు చెందిన పవన్ అభిమానులు పవన్ మాలను చేపట్టారు.
దేవుళ్ళకు చేసినట్లే ఈ దీక్షను వీరు కూడా ఎంతో నియమ నిష్ఠలతో చేయనున్నారట. మేడలో రుద్రాక్ష మాలతో పాటు అన్నిమతాల దేవుళ్ళ ఫోటోలతో ఉన్న దండలను వేసుకొని, ఎర్రకండువాను కప్పుకొని 49 రోజులు దీక్షలో పాల్గొంటారట. ఈ దీక్షను సెప్టెంబర్ 2 అనగా పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున విరమిస్తారట. ఇక అప్పటివరకు నిత్యం ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ నుంచి స్ఫూర్తిపొందిన పనులను గ్రామాలలో చేస్తారట. ఇక ఈ విషయం తెలియడంతో మిగతావారు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. అభిమానం అంటే థియేటర్ లో సినిమా వచ్చేవరకు ఉంటుంది.. లేకపోతే వారికి ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకాలు చేసేవరకు ఉంటుంది. కానీ ఇదేం అభిమానం రా బాబు.. దేవుడిలా కొలిచి మాలలు వేసుకోవడం ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.