Arun Vijay: డిసెంబర్ 9వ తేదీ తెలుగులో పలు చిన్న చిత్రాలు వెల్లువెత్తబోతున్నాయి. వాటికి అనువాద చిత్రాలూ జత కలిశాయి. అదే రోజున సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అరుణ్ ఒకదానిలో హీరోగా నటించగా, మరోదానిలో విలన్ పాత్ర పోషించాడు. ఇందులో ఒక సినిమా తమిళ డబ్బింగ్ కాగా మరొకటి కన్నడ డబ్బింగ్ మూవీ.
వివరాలలోకి వెళితే… అరుణ్ విజయ్ ఎంతోకాలంగా హీరోగా నటిస్తున్నా, ఇప్పుడిప్పుడే అతని సినిమాలు తెలుగులో డబ్ కావడం మొదలైంది. స్ట్రయిట్ తెలుగు సినిమాలలోనూ అరుణ్ విజయ్ నటిస్తుండటం దీనికి ఒక కారణం. అతని తాజా చిత్రం ‘సినం’ తమిళంలో చక్కని విజయాన్ని సాధించింది. ఇందులో అరుణ్ విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. తెలుగులో ఇప్పటికే పలు చిత్రాలలో నటించిన పల్లక్ లల్వాని ఇందులో హీరోయిన్. జి.ఎన్. కుమరవేలన్ తెరకెక్కించిన ఈ సినిమాను ‘ఆక్రోశం’ పేరుతో తెలుగులో డబ్ చేసి డిసెంబర్ 9న విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే… పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘చక్రవ్యూహ’. పునీత్ చనిపోవడానికి ముందు నుండే అతని చిత్రాలు కొన్ని తెలుగులో డబ్ అయ్యాయి. ఇప్పటికీ మరికొన్ని సినిమాలు తెలుగువారి ముందుకు వస్తున్నాయి. అలా ‘చక్రవ్యూహ’ సినిమాను ‘సివిల్ ఇంజనీర్’ పేరుతో డబ్ చేశారు. విశేషం ఏమంటే అరుణ్ విజయ్ ఈ మూవీలో విలన్ గా నటించాడు. ఈ సినిమానూ తెలుగులో డిసెంబర్ 9వ తేదీనే విడుదల చేయబోతున్నారు. అంటే అరుణ్ విజయ్ నటించిన రెండు సినిమాలు ‘ఆక్రోశం, సివిల్ ఇంజనీర్’ ఒకేరోజున రాబోతున్నాయి. అందులో ఒకదానిలో అతను హీరో కాగా, మరోదానిలో విలన్!