August Movies: Everyone’s hopes are on those movies!
ఆగస్ట్ 1 నుండి సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా మద్దత్తు తెలపడంతో చాలా వరకు షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ స్వచ్చంద సమ్మె ఓ వారం రోజులైనా జరుగుతుందనిపిస్తోంది. ఈ లోగా పలు విడతలుగా ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఎంప్లాయిస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్… చర్చలు జరిపి, ఏదో ఒక పరిష్కారానికి రావలసి ఉంది. ఇదిలా ఉంటే ఈనెలలో పలు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి.
మొన్నటి వరకూ ఓ లెక్క అయితే…. ఇప్పుడు మరో లెక్క. ఈ నెల మొదటి పక్షంలో విడుదలయ్యే చిత్రాలు ఏ మాత్రం ఆశాజనకమైన ఫలితాలను అందుకున్నా… నిర్మాతల్లో సరికొత్త ఆశలు చిగురించి, వీలైనంత త్వరగా సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టేసి, తిరిగి షూటింగ్స్ మొదలెట్టే ఆస్కారం ఉంటుంది. అసలు సెట్స్ పైకి వెళ్ళని సినిమాల సంగతి పక్కన పెడితే… వారం, పది రోజులు షూటింగ్ బాలెన్స్ ఉన్న నిర్మాతలు మాత్రం ఈ సమ్మె కారణంగా తమ బడ్జెట్ పెరిగిపోతుందని బెంగ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ లో జనం ముందుకు రాబోతున్న సినిమాలేంటో చూద్దాం…
ఆగస్ట్ ఫస్ట్ ఫ్రైడే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండి ‘బింబిసార’ మూవీ జనం ముందుకు రాబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలను పోషించిన ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించాడు. కీరవాణి సంగీతం అందించారు. కేథరిన్ తో పాటు ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ యేడాది ఇప్పటికే కేథరిన్ నటించిన ‘భళా తందనాన’, సంయుక్త నటించిన తొలి తెలుగు సినిమా ‘భీమ్లా నాయక్’ కూడా విడుదలయ్యాయి. విశేషం ఏమంటే… ఆ సినిమా కంటే ముందే సంయుక్త ‘బింబిసార’ కమిట్ అయ్యింది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూడబోతున్నారంటూ జూనియర్ ఎన్టీయార్ చెప్పడంతో నందమూరి అభిమానులు ‘బింబిసార’ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇదే వారం నటరత్న ఎన్టీయార్ స్థాపించిన వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి ‘సీతారామం’ సినిమా రిలీజ్ అవుతోంది. సీనియర్ నిర్మాత సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను రశ్మికా మందణ్ణ, సుమంత్, భూమిక, ప్రియదర్శి, గౌతమ్ మీనన్ వంటి వాళ్ళు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు అందించిన పాటలు ఇప్పటికే శ్రోతల ఆదరణ పొందాయి. హను రాఘవపూడి మనసు పెట్టి చేసిన ఈ సినిమా హిందీ మినహా దక్షిణాది భాషలన్నింటిలోనూ ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. ఈ వారమే విడుదలవుతుందని చెప్పిన సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ మరోసారి వాయిదా పడినట్టు అనిపిస్తోంది.
ఆగస్ట్ సెకండ్ వీక్ లో వచ్చే సినిమాల మీద కూడా సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 11వ తేదీ రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’. ఆమీర్ ఖాన్, కరీనాకపూర్, నాగచైతన్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమా తెలుగు వర్షన్ కు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. దాంతో ఈ మూవీ మీద తెలుగులోనూ కొంత బజ్ క్రియేట్ అయ్యింది. అది ఎక్కడ తగ్గకుండా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ప్రమోషన్స్ వరుసగా చేస్తూనే ఉన్నారు. ఇక ఆ మర్నాడే అంటే ఆగస్ట్ 12న నితిన్ మూవీ ‘మాచర్ల నియోజక వర్గం’ విడుదల కాబోతోంది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్ కాగా కేథరిన్ మరో కీలక పాత్ర పోషించింది. సో… కేథరిన్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయని అనుకోవాలి. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా నితిన్ కనిపించబోతున్నాడు. సముతిర ఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇది నితిన్ సొంత చిత్రం కావడంలో పబ్లిసిటీని భారీగానే చేస్తున్నారు. ఇదే రోజున రాబోతున్న మరో సినిమా ‘కార్తికేయ -2’. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి సంబంధించిన కథతో ఇది రూపుదిద్దుకుంది. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశారు. అభిషేక్ అగర్వాల్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ దీన్ని నిర్మించాడు. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఆ రకంగా ఇద్దరు సంగీత దర్శకుల వారసుల సినిమాలు ఆగస్ట్ 12న ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. ఆ మర్నాడే బెల్లంకొండ గణేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ‘స్వాతి ముత్యం’ విడుదల అవుతుందని ఆ మధ్య ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా ఆ సినిమాకు సంబంధించిన ఊసే లేకపోయింది. సో… ‘స్వాతి ముత్యం’ ఆగస్ట్ 13న విడుదల కావడం అనుమానమే!
ఆగస్ట్ మూడో శుక్రవారం చిత్రంగా చిన్న సినిమాలు భలే పోటీపడుతున్నాయి. అందులో ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’, సునీల్, అనసూయ నటించిన ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ రిలీజ్ కాబోతున్నాయి. కె. రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘వాంటెడ్ పండుగాడ్’కు జనార్దన్ మహర్షి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా, మరో రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అలానే ఈ వారమే ‘మాటరాని మౌనమిది, నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా, కమిట్ మెంట్’ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
అందరి దృష్టీ ‘లైగర్’ పైనే!
ఆగస్ట్ లో రాబోతున్న మరో మోస్ట్ అవైటింగ్ మూవీ ‘లైగర్’. ‘ఇస్మార్ట్ శంకర్’తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’.. విజయ్ దేవరకొండకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇంటర్నేషనల్ బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించడంతో ఒక్కసారిగా అంచనాలు అంబరాన్ని తాకాయి. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటించిన ఈ మూవీని పూరి, ఛార్మితో పాటు కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ ‘లైగర్’ భారీ స్థాయిలో విడుదల అవుతోంది. పూరి జగన్నాథ్ టీమ్ పకడ్బందీగా ‘లైగర్’ మూవీ ప్రమోషన్స్ ను కొంతకాలం క్రితమే ప్రారంభించింది. చిత్రం ఏమంటే… ఈ సినిమా విడుదల కాకముందే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్థాయిలో పూరి డైరెక్షన్ లో ‘జనగణమన’ చిత్రాన్ని, సమంత నాయికగా ‘ఖుషీ’ మూవీని చేస్తుండటం విశేషం. మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమాల్లో వేటికి ప్రేక్షకాదరణ లభిస్తుందో… ఏ సినిమాల విజయం నిర్మాతలో కొత్త ఆశలను రేకెత్తిస్తుందో చూడాలి.