మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ మూవీ మే 6న విడుదల కాబోతోంది. ఆ సందర్భంగా ఏప్రిల్ 20న మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సూర్యాపేట లో వడ్డీ వ్యాపారం చేసుకునే 33 సంవత్సరాల అల్లం అర్జున్ కుమార్ కు గోదావరి జిల్లాలోని అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. రెండు వేర్వేరు యాసలు, రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య కొత్త బంధం ఏర్పడుతుందనుకునేంతలో కథ అడ్డం తిరుగుతుంది. కారణం ఏమైనా ఆ అమ్మాయి అల్లం అర్జున్ కుమార్ తో పెళ్ళికి నో చెప్పేస్తుంది. ఇక అసలు కథ అక్కడే మొదలవుతుంది. ఈ ట్రైలర్ లో విశ్వక్ సేన్ నట విశ్వరూపమే చూపించాడు. ఇప్పటి వరకూ మాస్ కా దాస్ అనిపించుకున్న ఈ యంగ్ హీరో ఇందులో బోలెడంత సెంటిమెంట్ పండించడమే కాదు… వినోదాన్నీ అందించాడు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది.
‘పెళ్ళికాని ప్రసాద్’ అనగానే ఇంతవరకూ తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చేది విక్టరీ వెంకటేశ్! కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఆ జాబితాలోకి విశ్వక్ సేన్ కూడా చేరతాడనిపిస్తోంది. ఆ మధ్య వచ్చిన ‘రాజావారు రాణిగారు’ చిత్రాన్ని తెరకెక్కించిన రవికిరణ్ కోలా దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించాడు. జై క్రిష్ సంగీతం అందించిన ఈ మూవీకి పవి కె. పవన్ సినిమాటోగ్రాఫర్. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ ట్రైలర్ సైతం అదే జాబితాలో చేరి సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతోంది. విశ్వక్ సేన్ కెరీర్ లో ఇదో డిఫరెంట్ మూవీగా నిలబడటం ఖాయమనిపిస్తోంది.