ఆరడగుల అందం, పసిమిఛాయ, చూడగానే ఆకట్టుకొనే రూపం, విలక్షణమైన చిరునవ్వు అరవింద్ స్వామి సొంతం. తెరపై అరవింద్ స్వామిని చూడగానే ఎందరో ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. శ్రీదేవి లాంటి అందగత్తె సైతం ఈ అరవిందుని చేయి అందుకోవాలని ఒకానొక సమయంలో ఉవ్విళ్ళూరింది. దీనిని బట్టే అప్పట్లో అరవింద స్వామి క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు అరవింద్ స్వామి.
అరవింద్ స్వామి 1970 జూన్ 18న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి వి.డి.స్వామి తమిళనాట పేరు మోసిన వ్యాపారవేత్త. తల్లి భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన వసంత. మద్రాసు లయోలా కాలేజ్ లో బి.కామ్, చదివి పై చదువుల కోసం అమెరికా వెళ్ళిన అరవింద్ స్వామి అక్కడ కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించారు. ఆ యాడ్స్ లో అరవింద్ ను చూసిన మణిరత్నం తన ‘దళపతి’లో ఓ కీలక పాత్రకు ఆయనను ఎంచుకున్నారు. ఓ వైపు రజనీకాంత్, మరోవైపు మమ్ముట్టి మధ్యలో అరవింద్ అయినా ‘దళపతి’లో నటునిగా మార్కులు సంపాదించారు. ఆ పై మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’తో అరవింద్ హీరో అయిపోయారు. ఈ సినిమా అనువాదమై తెలుగునాట సైతం అలరించింది. అలాగే హిందీవారినీ ఆకట్టుకుంది. ఆ ఒక్క సినిమాతోనే అరవింద్ నటునిగా, ఎ.ఆర్. రహమాన్ సంగీత దర్శకునిగా ఎంతో పాపులర్ అయిపోయారు. మణిరత్నం రూపొందించిన ‘బొంబాయి’ సినిమా సైతం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విశేషంగా మురిపించింది. ఈ సినిమా తరువాత అరవింద్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అప్పుడే శ్రీదేవి మనసు కూడా అరవింద్ వైపు సాగింది. ప్రముఖ మళయాళ దర్శకులు భరతన్ రూపొందించిన ‘దేవరాగం’లో శ్రీదేవి, అరవింద్ కలసి నటించారు. ఆ సినిమా తరువాత వారిద్దరూ పెళ్ళి చేసుకుంటారనీ విశేషంగా వినిపించింది. అప్పటికే అరవింద్ ఓ ఇంటివాడు. అయినా సినిమా రంగంలో ఇలాంటి పుకార్లు షికార్లు చేయడం సహజమేగా!
తెలుగులో అరవింద్ స్వామి నేరుగా నటించిన చిత్రం ‘మౌనం’. ఈ చిత్రాన్ని ‘అంకురం’ ఫేమ్ సి.ఉమామహేశ్వరరావు తెరకెక్కించారు. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. ఆ పై దాదాపు 21 ఏళ్ళ తరువాత రామ్ చరణ్ హీరోగా రూపొందిన’ ధ్రువ’లోనే మళ్ళీ అరవింద్ తెలుగులో నటించారు. ఈ సినిమాలో విలన్ గా అరవింద్ విలక్షణమైన అభినయం జనాన్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం “నరగాసురన్, కల్లపార్త్, సతురంగ వేట్టై -2, వనంగముడి, రెండగమ” చిత్రాలలో కథానాయక పాత్రలోనే కనిపించబోతున్నారు అరవింద్. ఈ సినిమాలు తెలుగులోనూ అనువాదమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాలతో అరవింద్ ఏ తీరున జనాన్ని మెప్పిస్తారో చూడాలి.