(ఫిబ్రవరి 16న ఏయన్నార్ ‘ఆరాధన’కు 60 ఏళ్ళు)
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ కు ఉన్న అనుబంధం ఎనలేనిది. జగపతి బ్యానర్ లో ఏయన్నార్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. ఆ సంస్థ లో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం ‘ఆరాధన’. 1962 ఫిబ్రవరి 16న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రం ‘సాగరిక’ అనే బెంగాలీ సినిమా ఆధారంగా రూపొందింది. రీమేక్స్ తీయడంలో మేటి అని తరువాతి రోజుల్లో పేరు సంపాదించిన వి.మధుసూదనరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ ‘ఆరాధన’ కథ ఏమిటంటే – మురళీకృష్ణ ఎమ్.బి.బి.ఎస్., చదువుతూ ఉంటాడు. అతని తెలివికి మెచ్చి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వి.ఆర్.రావ్ స్కాలర్ షిప్ కూడా ఏర్పాటు చేస్తారు. మురళీకృష్ణ ఎవరితోనూ అంతగా మాట్లాడడు. తన భావాలను తనలోనే పంచుకుంటూ ఉంటాడు. అతను తన క్లాస్ మేట్ అయిన మరో డాక్టర్ అనురాధను ప్రేమిస్తాడు. ఆమెపై కవితలు కూడా రాసుకుంటాడు. అయితే మురళిని అతని క్లాస్ మేట్ మరో అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది. ఆమె మురళి నోట్ బుక్ లో రాసుకున్న ఓ కవితను అనురాధకు మురళి పంపినట్టుగా పోస్ట్ చేస్తుంది. అది కాస్తా అనురాధ తీసుకువెళ్ళి ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేస్తుంది. దాంతో మురళీకృష్ణ స్కాలర్ షిప్ కేన్సిల్ అవుతుంది. ఎలాగైనా తన కొడుకును విదేశాలకు పంపించి చదివించాలని ఆశిస్తాడు మురళి తండ్రి గోపాలం. లింగయ్య అనే వ్యక్తి విదేశాల్లో చదువు పూర్తయ్యాక, మురళి తన కూతురు లక్ష్మిని పెళ్ళి చేసుకుంటానంటే ఆ పైకం తాను సర్దుబాటు చేస్తానంటాడు. అందుకు మురళి తండ్రి అంగీకరిస్తాడు. మురళి విదేశాలకు వెళ్తాడు. మురళి ఆప్తమిత్రుడు అయిన మరో డాక్టర్ సారథికి అసలు విషయం తెలుస్తుంది. అనురాధకు మురళి పరిస్థితి చెప్పి మందలిస్తాడు. ఆమె కూడా తాను తొందరపడి మురళికి అన్యాయం చేశానేమో అని బాధపడుతుంది. లింగయ్య అనురాధకు బాబాయి వరస అవుతాడు. తన బిడ్డ లక్ష్మికి చదువు సంధ్య నేర్పించమని అనురాధకు చెబుతాడు. లక్ష్మినే మురళి కాబోయే భార్య అని అనురాధ తెలుసుకుంటుంది. లక్ష్మిని చక్కగా మారుస్తుంది. ఈ నేపథ్యంలోనే లక్ష్మి పేరుతో మురళికి తానే లేఖలు రాస్తూ ఉంటుంది. అయితే చిత్రంగా ఓ ప్రమాదం కారణంగా మురళికి కళ్ళు పోతాయి. దాంతో లక్ష్మి తన బావ యోగానందంను ప్రేమిస్తుంది. లింగయ్య కూడా మురళితో సంబంధం వద్దనుకుంటాడు. స్వదేశానికి వచ్చిన మురళికి అనురాధ సేవలు చేస్తుంది. అతనికి ఆమె తనను లక్ష్మిగానే పరిచయం చేసుకుంటుంది. ఆపరేషన్ చేస్తే మురళికి కంటిచూపు వస్తుంది. మురళి ముందు తనకు సేవలు చేసిన లక్ష్మిని చూడాలనుకుంటాడు. అయితే లక్ష్మిని చూసి ఇన్నాళ్ళు తనతో ఉన్నది ఆమె కాదని తెలుసుకుంటాడు. ఆమెనే రావాలని బాధ పడతాడు. ఆ పరిస్థితిలో అతను అలా బాధపడితే మళ్ళీ చూపు పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతారు. లింగయ్య, సారథి వెళ్ళి అనురాధను తీసుకు వస్తారు. ఇన్నాళ్ళు తనను ఆరాధించిన దేవత అనురాధ అని తెలుసుకొని మురళి మురిసిపోతాడు. మామూలు మనిషి అవుతాడు. చివరకు అనురాధ- మురళి, లక్ష్మి-యోగానందం పెళ్ళిళ్ళతో కథ ముగుస్తుంది.
ఇందులో ఏయన్నార్, సావిత్రి, రేలంగి, గిరిజ, జగ్గయ్య, నాగయ్య, రమణారెడ్డి, రాజశ్రీ, గుమ్మడి తదితరులు నటించారు.
ఈ సినిమాకు నార్ల చిరంజీవి, ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు. శ్రీశ్రీ, నార్ల చిరంజీవి, ఆరుద్ర, కొసరాజు పాటలు పలికించారు. యస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఏయన్నార్ ‘ఆరాధన’ సినిమా పేరు వినగానే నాటి అభిమానులకు చప్పున గుర్తుకు వచ్చే పాట – “నా హృదయంలో నిదురించే చెలీ…” అన్నదే. శ్రీశ్రీ రాసిన ఆ పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. ఈ సినిమా విడుదలైన రోజుల్లో శ్రీశ్రీని ఎవరో “ఇంతకూ మీ హృదయంలో నిదురించే చెలి ఎవరండి?” అని అడిగారట. అందుకు ఆయన తనదైన శైలిలో “కమ్యూనిజం” అని జవాబు చెప్పారని ఇప్పటికీ చెప్పుకుంటారు. “వెన్నెలలోని వికాసమే…” అనే పాటను కూడా శ్రీశ్రీ రాశారు. “ఓహో మావయ్య ఇది ఏమయ్యా… భలే భలే బాగా ఉందయ్యా…” అనే పాటను, “ఆడదాని ఓర చూపులో…” అనే మరో పాటను, “ఇంగ్లిష్ లోన మ్యారేజీ…” అంటూ సాగే ఇంకో పాటను ఆరుద్ర కలం పలికించింది. “నీ చెలిమి నేడె కోరితిని…” అనే గీతాన్ని నార్ల చిరంజీవి రాయగా, “ఏమంట ఏమంట…” అనే పాటను కొసరాజు అందించారు.
అనంతర కాలంలో కుటుంబకథా చిత్రాల దర్శకునిగా పేరొందిన పి.సి.రెడ్డి ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ చిత్రాన్ని రంగారావుతో కలసి వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా మంచి ఆదరణ చూరగొంది. శతదినోత్సవం చూసిందీ చిత్రం.