నటి అనుపమ పరమేశ్వరన్ అభిమానుల గుండెల్లో తూట్లు పొడిచేసింది. తాను ప్రేమలో ఉన్నానంటూ కుండబద్దలు కొట్టింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. మొదట పెళ్ళి గురించి అడగ్గా.. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని తెలిపింది. ప్రేమ వివాహంపై తనకు సదాభిప్రాయం ఉందని, ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటల్ని చూస్తే ముచ్చటగా అనిపిస్తుందని పేర్కొంది. తనక్కూడా ప్రేమ పెళ్ళే చేసుకోవాలనుందని, తన ఇంట్లో వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసని చెప్పింది. తాను పెళ్ళంటూ చేసుకుంటే, అది తప్పకుండా ప్రేమ పెళ్ళి అవుతుందని బల్లగుద్ది మరీ అంటోంది.
మరి.. మీరు ప్రేమలో ఉన్నారా? అని ప్రశ్నిస్తే, మొదట్లో సింగిలేనని అనుమప పేర్కొంది. ఆ తర్వాత కాదు మింగిల్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. అసలు తనకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని, ఎందుకంటే తన రిలేషన్‌షిప్ స్టేటస్ తనకే సరిగ్గా తెలియడం లేదని గందరగోళ సమాధానం ఇచ్చింది. తానైతే ప్రేమలో ఉన్నానని.. మరి అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదని.. కాబట్టి ప్రస్తుతానికి వన్ సైడ్ లవ్ అని చెప్పగలనని వెల్లడించింది. దీంతో, అనుపమ మనసు దోచిన ఆ రాకుమారుడు ఎవరా? అని నెట్టింట్లో చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ.. అనుమప తనని ప్రేమిస్తోందన్న విషయం, ఆ రాకుమారుడికి తెలుసా?
మరోవైపు.. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు అనుపమ కృతజ్ఞతలు తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌ని కూడా ఫాలో అవుతుంటానని, వాటిని చూసి నవ్వుకుంటానని చెప్పింది. కాగా.. ప్రస్తుతం అనుపమ ‘18 పేజెస్’, ‘కార్తికేయ 2’, ‘బటర్ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తోంది.