మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. సెట్స్ పైన పలు చిత్రాలు వివిధ దశల్లో ఉండగానే ఈ రోజు విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో కొత్త సినిమాను ప్రారంభించింది. విశేషం ఏమంటే… ఈ నిర్మాణ సంస్థ నిన్నటి నుండి ఓ రకంగా విజయోత్సవాన్ని జరుపుకుంటోంది. బుధవారం నేచురల్ స్టార్ నానితో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఆ వేదికపైనే నాని ఈ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. నిర్మాతలు కూడా మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ తర్వాత విడుదల కాబోతున్న ఈ సినిమా సైతం ఆ సినిమా తరహాలో ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్ కు లభిస్తున్న ఆదరణ వారి మాటలకు బలం చేకూర్చుతోంది. నాని కెరీర్ లో ఈ టీజర్ సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంటోంది. తొలి ఇరవై నాలుగు గంటల్లో నాని మూవీ 11 మిలియన్ వ్యూస్ ను దక్కించుకోవడమనేది ఇదే తొలిసారి. అలానే 366+K లైక్స్ ను ఇది సాధించింది. సహజంగా టాప్ స్టార్స్ సినిమాలకే ఈ ఫీట్ సాధ్యమౌతుంది.
ఈ స్పందనకు ప్రధాన కారణం హీరో నాని పోషించిన సుందరం పాత్రను దర్శకుడు వివేక్ ఆత్రేయ తీర్చిదిద్దిన విధానమే అని అంటున్నారు. బ్రాహ్మణుడైన హీరోకు, క్రిస్టియన్ అయిన హీరోయిన్ కు మధ్య ప్రేమ సన్నివేశాలు కొత్తగా, వినోదాత్మకంగా ఉండటంతో టీజర్ అందరి మనసుల్నీ దోచుకుందని చెబుతున్నారు. దానికి తోడు చక్కని టెక్నికల్ సపోర్ట్ సైతం దర్శకుడికి లభించింది. ఇంకో విశేషం ఏమంటే మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ గత యేడాది చివరిలో ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు అతని భార్య నజ్రియా నజీమ్ ‘అంటే సుందరానికీ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కూడా టీజర్ మాదిరి సూపర్ హిట్ అయితే… టాలీవుడ్ ఆడియెన్స్ ఈ మల్లూవుడ్ జోడీకి బ్రహ్మరథం పట్టినట్టే అనుకోవాలి. ఈ సినిమా జూన్ 10న తెలుగుతో పాటు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది.