న్యాచురల్ స్టార్ నాని మరోసారి నవ్వించడానికి సిద్దమయిపోయాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన మేకర్స్ అందులో భాగంగా మొదటి పాటను రిలీజ్ చేశారు. పంచె కట్టు అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మొట్టమొదటిసారి తెలుగు సాంగ్ ని కర్నాటిక్ సింగర్ అరుణ సాయిరామ్ ఆలపించారు.
‘సారోరూ.. ఫేడైపోయే ఫ్రీడమ్ మీదింక.. ఎహ్ మీదింక.. సారోరూ అంటూ టీజింగ్ లిరిక్స్ ని అంతే టీజింగ్ గా పాడారు అరుణ.. ఇక వీడియోలో నాని లుక్ మరింత ఆసక్తి రేపుతోంది. అమెరికా వచ్చిన సుందర్.. ఏవేవో పనులు చేస్తూ ఎన్ని కష్టాలు పడుతున్నాడు అనేది సాంగ్ ద్వారా తెలిపారు. ఇంకోరకంగా చెప్పాలంటే సుందర్ పాత్రను ఈ సాంగ్ ద్వారా పరిచయం చేశారు. రంగంలోకి దూకారు సుందర్ మాస్టారు అంటూ రైమింగ్ లిరిక్స్ ఇంకా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ లిరిక్స్ ని ‘రాజ రాజ చోర’ దర్శకుడు హర్షిత్ గోలి రాయడం విశేషం. మొత్తానికి సాంగ్ తోనే సినిమా మరింత అంచనాలను పెంచేశారు మేకర్స్. ఇక మధ్యలో నజ్రియా లైఫ్ కూడా చూపించడం హైలైట్ గా నిలిచింది. జూన్ 10 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.