Game On: కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఆన్’. ఈ ప్రాజెక్ట్ లో అన్నదమ్ములిద్దరు కీలక భూమికలు పోషిస్తున్నారు. అన్న గీతానంద్ హీరోగా నటిస్తుండగా, తమ్ముడు దయానంద్ ‘గేమ్ ఆన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ’90 ఎం.ఎల్.’ ఫేమ్ నేహా సోలంకి ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం అశ్విన్ – అరుణ్ స్వరపరచగా, కిట్టు విస్సాప్రగడ రాసిన ‘పడిపోతున్న’ అనే సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. దీన్ని అనురాగ్ కులకర్ణి, హారిక నారాయణ్ పాడారు. ”తొలిసారి కాదా ఈ ప్రేమ… ఎదలోని ఉంది నువ్వేనా… ఇన్నాళ్లు లేని హైరానా… అలవాటుగానే కలిగేనా… పడిపోతున్న నిన్ను చూస్తూ…” అంటూ సాగే గీతం సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
ఈ సందర్బంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ, “గతంలో విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. నవాబ్ గ్యాంగ్ మా సినిమా కోసం చక్కని సంగీతం అందించారు. గతంలో పలు చిత్రాల్లో పని చేసి.. ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రానికి టైటిల్ సాంగ్ కి పనిచేశారు. అంత బిజీలోను మా చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. ఇపుడు విడుదల చేసిన రెండో పాటకు కూడా స్పందన బాగుంది. ఈ మూవీకి అరవింద్ విశ్వనాథన్ అద్భుతంగా విజువల్స్ ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను మరో కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. చిత్రీకరణ , నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ‘‘రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ ఇది. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు రావడమే కాదు.. సక్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవలోనే ‘గేమ్ ఆన్’ ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్… అన్ని సమపాళ్ళలో ఉంటాయి” అని అన్నారు.