Another 600 Screens Added To GodFather In Hindi Belt: ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు.. ప్రేక్షకుల నుంచి దానికి లభించే విశేష ఆదరణ అంతా ఇంతా కాదు. రిపీటెడ్ ఆడియన్స్‌తో పాటు చూడకూడదనుకున్న ఆడియెన్స్ కూడా సినిమా చూసేందుకు ఎగబడతారు. ఫలితంగా.. మంచి వసూళ్లు నమోదవుతాయి. ఒక్కోసారి ప్రేక్షకుల తాకిడి ఎక్కువైతే, థియేటర్ల సంఖ్యను సైతం పెంచుతారు. ఇప్పుడు గాడ్‌ఫాదర్ సినిమా విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. తొలిరోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్స్ రావడం, లూసిఫర్ కన్నా ఈ రీమేక్‌లో మంచి మెరుగులు దిద్దారని అభిప్రాయాలూ వ్యక్తమైన నేపథ్యంలో.. ఈ సినిమా చూసేందుకు జనాలు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో.. కొత్తగా 600 స్క్రీన్స్ పెంచినట్టు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. అది కూడా హిందీ బెల్ట్‌లో! ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు.
‘‘గాడ్‌ఫాదర్‌పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి నా ధన్యవాదాలు. ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే రూ. 69 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. బాలీవుడ్‌లో కూడా మంచి ఆదరణ వస్తున్న తరుణంలో.. అక్కడ అదనంగా మరో 600 స్క్రీన్స్ పెంచినట్టు నాకు సమాచారం అందింది. మా చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా మలిచినందుకు.. దేశం నలుమూలల ఉన్న నా అభిమానులకు, సినీ ప్రియులకు హృదపూర్వక కృతజ్ఞతలు. జై హింద్’’ అంటూ ఆ వీడియోలో చిరంజీవి చెప్పుకొచ్చారు. కాగా.. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘లూసిఫర్’కి ఇది రీమేక్. అయితే.. ఉన్నది ఉన్నట్టుగా దింపకుండా.. మాతృకను దెబ్బతీయకుండా, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దర్శకుడు మోహన్ రాజా చాలా మార్పులు చేశారు. ఈ చిత్రంలో సత్యదేవ్, నయనతారలతో పాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించారు.