Anasuya: బుల్లితెర యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక విషయంలో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా అనసూయ ‘ఆంటీ’ అనే పదాన్ని బ్యాన్ చేయాలంటూ పోరాటం చేస్తోంది అంటే అతిశయోక్తి కాదు. తనను ఆంటీ అని పిలిచినవారిపై కేసు కూడా పెట్టిన అను.. తనను అలా పిలిచిన ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తూ వస్తోంది. ఇక ఈ విషయంలో అనుకు కొందరు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం అనసూయ మాత్రం వరుస సినిమాలతో, షోలతో బిజీగా మారింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ, సుమ యూట్యూబ్ ఛానెల్ లో సందడి చేసింది. యాంకర్ సుమ తన యూట్యూబ్ ఛానెల్ లో క్రేజీ కిచెన్ అని ఒక వంటల ప్రోగ్రాం స్టార్ట్ చేసిన విషయం విదితమే.
తాజాగా ఈ షోకు అనసూయ గెస్ట్ గా వచ్చింది. ఇక ఇద్దరు యాంకర్ల మధ్య వినోదం మాములుగా లేదు. ఎప్పటిలానే సుమ , అనసూయతో వంట చేయిస్తునే ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేసింది. అదే పని, ఇదే పని అన్నట్లు ఆంటీ వివాదం గురించి కూడా అడిగేసింది. దానికి సమాధానం గా అనసూయ మాట్లాడుతూ ” ట్విట్టర్ వార్ లోకి దిగాకా నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే అత్తా.. పిత్తా అని పిలిపించుకోవాలని కూడా లేదు. నన్ను అందరు స్టైల్ గా అనసూయ, అను అనే పిలవాలి.. నా కోడలైనా కూడా” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంపతీసి ఆంటీ.. అంటే కోడలిపైనా కూడా కేసు పెడతావా..? ఏంటి అని కొందరు.. అంటే అనసూయ మీ అత్తగారిని కూడా ఇలాగే పిలుస్తున్నావా..? పేరు పెట్టి పిలుస్తున్నావా ..? అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.