తాత గుణాలు మనవడికి రాకుండా పోవు అంటారు. అందునా తల్లివైపు తాత లక్షణాలు వస్తే మరింత మంచిదనీ చెబుతారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా నందా కొడుకు అగస్త్య కూడా తాతబాటలో పయనించాలని డిసైడ్ అయ్యాడు. స్కూల్ చదువుతున్న రోజుల్లోనే నటనలో శిక్షణ తీసుకున్నాడు అగస్త్య. అమితాబ్ బచ్చన్ ను సూపర్ స్టార్ గా నిలపడంలో జంట రచయితలు సలీమ్-జావేద్ పాత్ర ఎంతయినా ఉంది. ఈ రచయితల్లో ఒకరైన జావేద్ అక్తర్ కూతురు జోయా అక్తర్ దర్శకత్వం వహించే ‘ద ఆర్చీస్’ చిత్రం ద్వారా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య పరిచయం అవుతూ ఉండడం విశేషం. ఈ సినిమా ఏప్రిల్ 18న లాంఛనంగా ప్రారంభమయింది. ఈ చిత్రాన్ని జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తూ నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారు.
ఈ సందర్భంగా తన మనవడు అగస్త్యకు అభినందనలు తెలుపుతూ బిగ్ బి ఓ ట్వీట్ చేశారు. “నీ జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలయింది. ఇంతకంటే ఆనందం మాకు వేరేముంది? నా ఆశీస్సులు, ప్రేమ సదా తోడై ఉంటాయి” అని ఆ ట్వీట్ సారాంశం. చివరగా “కీప్ ద ఫ్లాగ్ ఫ్లైయింగ్…” అంటూ ముగించారు. అంటే తమ కీర్తి పతాకాన్ని మనవడు కూడా ఎగిరేలా చేయాలని ఈ తాత ఆశిస్తున్నారు. మరి మనవడు అగస్త్య తన తొలి చిత్రం ‘ద ఆర్చీస్’లో ఏం చేస్తాడో చూడాలి.