కేవలం వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం గత యేడాది అమేజాన్ ప్రైమ్ సంస్థ 13 బిలియన్ డాలర్లు వెచ్చించిందట. ఈ విషయాన్ని ఇటీవల సంస్థకు చెందిన ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి తెలిపారు. పదమూడు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లో 96 వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తం చూస్తే… ఎవరైనా అమ్మో అంటూ ఆశ్చర్యపోక మానరు. కేవలం వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం ఇన్ని కోట్ల రూపాయలా అంటూ చాలామంది నోరు వెళ్ళ బెడతారు. కానీ, అమెజాన్ పోటీదారులతో పోల్చి చూస్తే ఇది చాలా తక్కువ అనే చెబుతున్నారు ట్రేడ్ పండిట్స్. అమేజాన్ ప్రధాన ప్రత్యర్థిగా భావించే డిస్నీ హాట్ స్టార్ సంస్థ అయితే గత సంవత్సరం ఏకంగా 33 బిలియన్ డాలర్లను వెచ్చించిందట! అంటే మన కరెన్సీలో దాదాపు రెండు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలన్న మాట! అన్న మాటే కాదు ఇది ఉన్న మాట కూడానూ!
ఇక నెట్ ఫ్లిక్స్ విషయానికి వస్తే గత సంవత్సరం మ్యూజిక్ కంటెంట్ కోసం ఈ సంస్థ 17 బిలియన్ డాలర్లు వెచ్చించింది. అంటే మన కరెన్సీలో లక్షా ఇరవై ఆరువేల కోట్ల రూపాయలన్న మాట! అంటే అమేజాన్ వెచ్చించింది చాలా తక్కువే అని చెప్పవచ్చు. అదికూడా అంతకు ముందు సంవత్సరంతో పోల్చిచూస్తే ఈ యేడాది 13 బిలియన్ డాలర్లు అని తేలింది. అంతకు ముందయితే మ్యూజిక్, వీడియో కోసం అమేజాన్ ఖర్చు చేసింది 12 బిలియన్ డాలర్లేనని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే అమ్మో...అమేజాన్
కాదు, అంతేనా...అమేజాన్...
అనాల్సి ఉంటుందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. అయితే అమేజాన్ వెచ్చిస్తున్న మొత్తానికి తగిన లాభాలూ చూస్తోందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఎలాగంటే ఎంతో క్రేజ్ ఉన్న థర్స్ డే నైట్ ఫుట్ బాల్
ఎక్స్ క్లూజివ్ కోసం ఈ సంస్థ వెచ్చిస్తోంది ఒక బిలియన్ డాలర్లే! అలాగే ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్
వంటి హై ప్రొఫైల్ షోస్ తోనూ సంస్థ భలేగా కొల్లగొట్ట బోతోంది. లెక్కలు చూస్తే అమ్మో అనిపించేలా ఉన్నా, ఇతర సంస్థల వ్యయంతో పోల్చి చూస్తే అమేజాన్ ఖర్చు పెడుతున్నది తక్కువే. అయితే రాబడి మాత్రం ఇతరుల కన్నా మిన్నగా పోగేస్తోంది.