సినిమా రంగంలో నటిగా, సమాజ సేవలో తనదైన ముద్ర వేసిన అమల అక్కినేని ఇప్పుడు విద్యా రంగంలో కూడా తన ప్రతిభను చూపిస్తున్నారు. తాజాగా ఆమె అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా తరఫున మెక్సికోలో జరుగుతున్న CILECT కాంగ్రెస్ 2025లో పాల్గొంటున్నారు. ఈ కాన్ఫరెన్స్ అక్టోబర్ 27 నుండి 31 వరకు గ్వాడలజారాలో జరుగుతుంది. CILECT అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా, టెలివిజన్, మీడియా కాలేజీల సంఘం. ఇందులో సినిమా విద్య, సాంకేతికత, సృజనాత్మకత పై పరిశోధనలు చేయడం, వాటి మధ్య సహకారం పెంచడం ఈ సంస్థ లక్ష్యం. ప్రతి ఏడాది ప్రపంచంలోని ప్రముఖ సినీ కళాశాలల టీచర్లు, నిపుణులు, విద్యార్థులు కలిసి సినిమా రంగంలో కొత్త ఆలోచనల పై చర్చిస్తారు. ఈ ఏడాది కాంగ్రెస్‌కి థీమ్ – “ఇరవై ఒకటవ శతాబ్దపు సినిమాలో మనస్సాక్షి యొక్క పరివర్తన శక్తి”. అంటే, సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా, సమాజంలో అవగాహన, మార్పు తీసుకురావడం ఎంత శక్తివంతమైన మాధ్యమమో చర్చించనున్నారు.
Also Read : Pawan-Kalyan : పవన్ కళ్యాణ్‌కి భారీ అడ్వాన్స్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్!
ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ.. “CILECT కాంగ్రెస్ 2025లో అన్నపూర్ణ కాలేజ్‌కి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గర్వంగా ఉంది. గత సంవత్సరం చైనాలో జరిగిన కాంగ్రెస్‌లో విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై చర్చించాం. ఈసారి ‘సినిమాలో మనస్సాక్షి శక్తి’ అనే అంశం ఎంచుకున్నారు. సినిమా అంటే కేవలం వినోదం కాదు అది ఆలోచింపజేసే, మార్పు తీసుకురాగల శక్తి. మా విద్యార్థులు సృజనాత్మకతతో, ధైర్యంగా, మనసుకు దగ్గరైన కథలు చెప్పేలా ప్రోత్సహించడం మా లక్ష్యం” అని చెప్పారు. ఈ కాంగ్రెస్‌లో పాల్గొనడం ద్వారా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇతర దేశాల విద్యాసంస్థలతో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అలాగే భారతదేశంలో సినిమా విద్యను ప్రపంచ ప్రమాణాలకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో అమల అక్కినేని ముందుకెళ్తున్నారు. మొత్తానికి, అమల అక్కినేని ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలుగు సినిమా విద్యకు, భారతీయ సినీ రంగానికి గర్వకారణంగా నిలిచింది.