విప్లవజ్యోతిగా, మన్నెం వీరుడుగా జనం మదిలో నిలచిపోయారు అల్లూరి సీతారామరాజు. జూలై 4న ఆయన 125వ జయంతి. ఈ సందర్భంగా ఊరూవాడా ఆ మహావీరుని జనం స్మరించుకుంటున్నారు. వెండితెరపైన కూడా విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజుగా వెలిగిన నటులున్నారు. ఆంధ్ర స్వాతంత్య్ర వీరులలో ఈ నాటికీ ముందుగా స్మరించుకొనే అల్లూరి సీతారామరాజు జీవితగాథ ఆధారంగా మహానటుడు, మహానాయకుడు యన్.టి.రామారావు ఓ చిత్రం రూపొందించాలని భావించారు. యన్.ఏ.టి. పతాకంపై ‘జయసింహ’ చిత్రం నిర్మించి, తొలి విజయాన్ని అందుకున్నారు యన్.టి.ఆర్, ఆయన సోదరుడు త్రివిక్రమరావు. అప్పుడే అల్లూరి సీతారామరాజు గాథతో ఓ సినిమా రూపొందించాలని భావించారు యన్టీఆర్. అందుకోసం మేకప్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. ఆ గెటప్‌ను ‘జయసింహ’ పాటల పుస్తకం వెనుక కూడా ప్రచురించారు. కానీ, ‘అల్లూరి సీతారామరాజు’ కథను తెరకెక్కిద్దాం అనుకుంటూనే యన్టీఆర్ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలలో బిజీగా సాగుతూ ఉండడం వల్ల ఆ సినిమా తీయడం కుదరలేదు. అయితే యన్టీఆర్‌ను అల్లూరి సీతారామరాజుగా వెండితెరపై తొలిసారి చూపిన ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావుకే దక్కింది. 1980లో యన్టీఆర్ హీరోగా దాసరి రూపొందించిన ‘సర్దార్ పాపారాయుడు’లో “వినరా సోదర వీరకుమార…భారత యోధుల గాథలు…” అంటూ సాగే శ్రీశ్రీ బుర్రకథలో అల్లూరి సీతారామరాజు గాథ వినిపిస్తారు. అందులో యన్టీఆర్ అల్లూరిగా కనిపించారు. కాసేపు తెరపై అల్లూరిగా యన్టీఆర్ కనిపించగానే జనం ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత యన్టీఆర్ చివరి చిత్రంగా రూపొందిన ‘మేజర్ చంద్రకాంత్’లోనూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరోమారు యన్టీఆర్ ను అల్లూరి సీతారామరాజు పాత్రలో చూపించారు. ఇందులోనూ “పుణ్యభూమి నా దేశం నమో నమామి…”అంటూ సాగే జాలాది పాటలో యన్టీఆర్ శివాజీ, అల్లూరి, నేతాజీ గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ సినిమా సైతం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా రెండు సార్లూ యన్టీఆర్ పాట నేపథ్యంలోనే అల్లూరి సీతారామరాజుగా తెరపై కనిపించారు. రెండు చిత్రాలూ ఘనవిజయం సాధించాయి.
ఇక తెలుగు తెరపై పూర్తి స్థాయిలో ‘అల్లూరి సీతారామరాజు’ గాథను రూపొందించిన ఘనత కృష్ణ, ఆయన సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావుకే దక్కింది. 1974లో కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’గా వి.రామచంద్రరావు దర్శకత్వంలో సినిమా రూపొందింది. తెలుగునాట తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా స్కోప్ గా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ ఘనవిజయం సాధించింది. స్వర్ణోత్సవం జరుపుకుంది. ఈ చిత్రానికి ముందు 1968లో కృష్ణ హీరోగా రూపొందిన ‘అసాధ్యుడు’ చిత్రంలో ఓ సన్నివేశంలో ఆయన అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపిస్తారు. ఈ చిత్రానికి కూడా వి.రామచంద్రరావు దర్శకుడు కావడం విశేషం! ‘అసాధ్యుడు’ సినిమా మంచి ఆదరణ పొందింది.
ఇలా తెలుగు తెరపై అల్లూరి సీతారామరాజు అనగానే యన్టీఆర్, కృష్ణ ముందుగా గుర్తుకు వస్తారు. చిత్రమేమంటే, వీరిద్దరి నటవారసులు సైతం అల్లూరి సీతారామరాజు గెటప్స్‌లో కనిపించడం. యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ తన ‘భారతంలో బాలచంద్రుడు’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కాసేపు తెరపై కనిపించారు. ఆ తరువాత తన తండ్రి యన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’లోనూ ఆయన అల్లూరి సీతారామరాజు గెటప్‌లో తళుక్కుమన్నారు. ఈ రెండు సినిమాలు అంతగా అలరించలేక పోయాయి. ఇక కృష్ణ తనయుడు మహేశ్ బాబు తన తండ్రి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘ముగ్గురు కొడుకులు’ చిత్రంలో ఓ సీన్ లో అల్లూరి సీతారామరాజుగా స్టేజ్ పై ఏకపాత్రాభినయంలో కనిపించారు. ఈ సినిమా పరవాలేదు అనిపించింది.
మరో విశేషమేమంటే, బాలకృష్ణ, మహేశ్ బాబు ఇద్దరూ ‘రామరాజు’ పేరుతో సాంఘిక చిత్రాల్లోనూ నటించారు. బాలకృష్ణ ‘రౌడీ ఇన్ స్పెక్టర్’లో రామరాజు పేరున్న పాత్రలో అభినయించారు. ఈ సినిమా సూపర్ హిట్. ఇక మహేశ్ బాబు ‘ఖలేజా’లో ఆయన పేరే అల్లూరి సీతారామరాజు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇలా నందమూరి, ఘట్టమనేని వంశాల రెండు తరాల హీరోలు అల్లూరి సీతారామరాజు గెటప్ లో అలరించడం ఓ విశేషంగా నిలచింది.