ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్లను దూకుడుగా నిర్వహిస్తోంది. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తాను సినిమాలో మేకప్ కోసం పడిన కష్టాన్ని వివరించారు. “పుష్ప” కోసం తాను చాలా కష్టపడ్డానని, అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇలాంటి పాత్ర కోసం తానెప్పుడూ పెద్దగా ప్రిపేర్ కాలేదని చెప్పాడు.
Read Also : ఆఖరి నిమిషంలో ‘పుష్ప’రాజ్ ఆందోళన… తొలగిన అడ్డంకి
‘పుష్ప’రాజ్ పాత్ర కోసం తాను 2.5 గంటల పాటు మేకప్ వేసుకున్నానని, మేకప్ తుడిచి వేయడానికి సినిమా షూటింగ్ తర్వాత కనీసం మరో 30 నిమిషాలు పడుతుందని చెప్పాడు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఇంతటి మేకప్ అవసరం లేని కమర్షియల్ సినిమాలే చేశానని, వాటికి మినిమల్ మేకప్ మాత్రమే అవసరం అయ్యేదని అన్నారు. ఏ సినిమా కష్టం ఆ సినిమాకు ఉంటుంది… కానీ ఈ సినిమాలో మేకప్ కోసం కూడా కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే ‘పుష్ప’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మేకప్, ప్రోస్తేటిక్స్ గురించి తెలుసుకున్నానని చెప్పాడు. ‘పుష్ప’రాజ్ శ్రీవల్లితో కలిసి డిసెంబర్ 17న అంటే ఈ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.