Allu Arjun Rejected Huge Offer Becuase Of This: భారీ పారితోషికం ఆఫర్ చేస్తే, ఏ యాడ్ చేసేందుకైనా నటీనటులు ముందుకొచ్చేస్తారు. గుట్కా దగ్గర నుంచి కండోమ్ దాకా ఏదైనా సరే.. డబ్బిస్తే స్టార్లు కూడా దిగొచ్చేస్తారు. ‘బోలో జుబాఁ కేసరి’ అంటూ విమల్ సంస్థ.. అదేదో మల్టీవర్స్ అన్నట్టు ఏకంగా ముగ్గురు స్టార్లను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే! ఇతర గుట్కా యాడ్‌లతో పాటు ఆల్కహాల్, కండోమ్ యాడ్స్ కూడా కొందరు యాక్టర్లు చేశారు. సినిమాల తరహాలోనే ఆ యాడ్స్ చేసేందుకు కూడా స్టార్లు పోటీ పడుతున్నారు. కానీ, కొందరు మాత్రం వీటికి దూరంగా ఉంటున్నారు.
ముఖ్యంగా.. గుట్కా, ఆల్కహాల్ యాడ్స్ చేసేందుకు కొంతమంది స్టార్ హీరోలు ఆసక్తి చూపట్లేదు. కోట్లిచ్చినా సరే, ససేమిరా అనేస్తున్నారు. అలాంటి వారి జాబితాలో తాజాగా అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. రీసెంట్‌గా ఓ కంపెనీ తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటూ బన్నీని సంప్రదించింది. ఇందుకోసం ఏకంగా రూ. 10 కోట్ల పారితోషికం ఆఫర్ చేసింది. కానీ, ఎంత డబ్బిచ్చినా తాను చేయనని బన్నీ తెగేసి చెప్పాడట! జనాలకు హాని కలిగించే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యం తనకు లేదని పేర్కొంటూ.. ఈ భారీ ఆఫర్‌ను బన్నీ సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. దీంతో, బన్నీ నిర్ణయం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ అతడ్ని ప్రశంసిస్తున్నారు.
ఇదిలావుండగా.. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, ఇప్పుడు తన దృష్టంతా ‘పుష్ప: ద రూల్’ మీదే పెట్టాడు. మొదటి భాగం కంటే దీనిని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి, బన్నీ కూడా తనదైన సహకారం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం పలువురు బాలీవుడ్ నటీనటులతో పాటు దక్షిణాది నటుల్ని రంగంలోకి దింపుతున్నారని సమాచారం. పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చేలా దర్శకుడు సుకుమార్ చాలా మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.