Allari Naresh: అల్లరి నరేష్ నాంది సినిమాతో రూట్ మార్చేశాడు. విభిన్నమైన కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయం వైపు దూసుకెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ అల్లరోడు నుంచి వస్తున్న మరో విభిన్నమైన చిత్రం ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 25 న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలను తీసుకొచ్చిపెట్టింది. కాగా, సినిమా రిలీజ్ రేపే కావడంతో నరేష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ కు పాలిటిక్స్ గురించిన ప్రశ్న ఎదురైంది. “జీవితంలో రాజకీయాలకు వచ్చే ఉద్దేశ్యం ఏమైనా ఉందా..?” అని అడుగగా నరేష్ చాలా తెలివిగా సమాధానం చెప్పి మెప్పించాడు. ” రాజకీయాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. అవి నాకు సెట్ కావు. నేను చాలా సెన్సిటివ్.. నెగెటివ్ గా మాట్లాడడం రాదు. సెన్సిటివ్ గా ఉన్నవాళ్లకు రాజకీయాలు పనికిరావు. ఫ్యూచర్ లో దర్శకుడును అవుతాను కానీ, రాజకీయ నాయకుడిని కాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.