‘అల్లరి’ నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘నాంది’. నటుడిగా నరేశ్ కు చక్కని పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమా కమర్షియల్ గానూ సక్సెస్ సాధించింది. ఈ మూవీ హిందీ రీమేక్ రైట్స్ ను అదే సమయంలో ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. ‘నాంది’ తర్వాత అర్థవంతమైన చిత్రాలలో నటించడం మొదలెట్టారు ‘అల్లరి’ నరేశ్. ప్రస్తుతం అతను హీరోగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఇదిలా ఉంటే తనకు ‘నాంది’ లాంటి సినిమాను ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేశ్ మరో సినిమా చేయబోతున్నారు. దీన్ని ‘కృష్ణార్జున యుద్థం, మజిలీ, గాలిసంపత్, టక్ జగదీశ్’ వంటి ఆసక్తికరమైన చిత్రాలను నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం వెలువడింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సైతం ఆసక్తికరంగా ఉంది. రక్తపు మరకలతో నిండిన సంకెళ్ళు వేసిన చేతులు, ఆ చేతుల నీడ గోడపై స్వేచ్ఛగా ఎగిరే ఒక పక్షిలా కనిపించడం చూస్తుంటే, ఇది కూడా థాట్ ప్రొవేకింగ్ మూవీ అనే భావన కలిస్తోంది. ఈ న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ షూటింగ్ పూర్తి కాగానే మొదలు కానుంది.