Tollywood: సూపర్ స్టార్ కృష్ణకు ఘననివాళి ఇవ్వడానికి టాలీవుడ్ సిద్దమయ్యింది. చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నోసేవలు అందించిన కృష్ణ మృతికి టాలీవుడ్ ఘన నివాళి ఇవ్వడానికి సిద్దపడింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి(TFPC), తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్(TFCC) ఆయన మీద గౌరవంతో నవంబర్ 16 న అనగా రేపు షూటింగ్స్ ను నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేసింది. “ఇందు మూలంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలియజేయునది.. ప్రముఖనటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత, సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజు ఉదయం హైదరాబాదులో స్వర్గస్తులైనారు. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ గారికి గౌరవ సూచనగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ రేపు (బుధవారం 16-11-2022) మూసివేయడం జరుగుతుంది” అని నిర్మాతల మండలి చెప్పగా.. “శ్రీ ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి (సూపర్ స్టార్ కృష్ణ) తేదీ: 15-11-2022 తెల్లవారుఝామున ఆకస్మిక మరణం పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ తీవ్ర దిగ్భ్రాంతిని మరియు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ తరపున శ్రీ ఘట్టమనేని కృష్ణ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. శ్రీ ఘట్టమనేని కృష్ణ తేదీ 31-05-1943 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలి, బుర్రిపాలెంలో జన్మించారు.శ్రీ ఘట్టమనేని కృష్ణ 1965 వ సంవత్సరంలో “తేనె మనసులు” చిత్రంతో సినిమా హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుండి ఆయన వెనుదిరిగి చూడలేదు,అనేక పాత్రలు పోషిస్తూ దాదాపు 350 సినిమాలలో హీరోగా నటించారు.
శ్రీ ఘట్టమనేని కృష్ణ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, దూరదృష్టి, డైనమిక్ మరియు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, హీరో, నిర్మాత, దర్శకుడు మరియు స్టూడియో యజమాని. ఆయనను చలనచిత్ర పరిశ్రమ మరియు అయన అభిమానులందరూ సూపర్ స్టార్ కృష్ణ అని పిలుస్తారు. ఆయన తన సినీ ప్రయాణంలో అనేక రకాల పాత్రలను పోషించారు, వాటిలో ముఖ్యంగా “అల్లూరి సీతారామరాజు” స్వాతంత్ర సమరయోధుడు ఒకటి, ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన మరియు అనేక ప్రశంసలు పొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈస్ట్‌మన్‌కలర్, 70MM, DTS సౌండ్ మరియు సినిమా స్కోప్‌లను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఆయన M/s. పద్మాలయా స్టూడియోస్ మరియు M/s.పద్మాలయా ప్రొడక్షన్ హౌస్ లను స్థాపించి అన్ని భారతీయ భాషలలో అనేక చిత్రాలను నిర్మించారు. అలాగే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో విజయవంతమైన హిందీ చిత్రాలను నిర్మిస్తూ 1980ల నుండి M/s.పద్మాలయాని కూడా బాలీవుడ్ యొక్క ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిపారు. ఆయనకీ 1) 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2) 2009లో “పద్మభూషణ్”, 3) 1974లో ఉత్తమ నటుడిగా “అల్లూరి సీతారామరాజు” నంది అవార్డు, 4) 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ – సౌత్ 5) 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అనే అనేక అవార్డులు అందుకున్నారు. శ్రీ ఘట్టమనేని కృష్ణ 1989లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. శ్రీ ఘట్టమనేని కృష్ణ గారి పవిత్ర ఆత్మకు నివాళులర్పిస్తూ, రేపు అనగా తేదీ: 16-11-2022 తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క అన్ని కార్యకలాపాలను ఆపివేయడం జరుగుతుంది.” అని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది.