పోస్ట్ ప్యాండమిక్ తర్వాత బాలీవుడ్ నిదానంగా కుదురుకుంటోంది. భారీ కలెక్షన్లను వసూలు చేయలేకపోయినా, నిదానంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అలవాటు పడుతున్నారు. పలు రాష్ట్రాలలో యాభై శాతమే ఉన్న ఆక్యుపెన్సీ రేట్ కూడా ఈ కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. అయితే ప్యాండమిక్ తర్వాత విడుదలైన చిత్రాలలో రూ. 100 కోట్ల గ్రాస్ ను అందుకున్న చిత్రాలలో నాలుగోదిగా అలియా భట్ ‘గంగూభాయి కఠియావాడి’ నిలిచింది.
ఇప్పటికే ‘సూర్యవంశీ, పుష్ప (హిందీ), 83’ చిత్రాలు వంద కోట్ల గ్రాస్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి మూడు సినిమాలకు భిన్నంగా ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం మరో విశేషం. అలియా భట్ నటిస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ ఈ నెల 25న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇది ఆ చిత్ర నిర్మాతలకూ ఓ రకంగా తీపి కబురే!