అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన కాప్ యాక్షన్ డ్రామా ‘సూర్యవంశీ’ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేయడం మొదలు పెట్టింది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ళుగా అక్షయ్ అభిమానులను ఊరిస్తూ వచ్చిన ఈ సినిమాకు నవంబర్ 5న మోక్షం లభించింది. దాంతో థియేటర్లలో ఫ్యాన్స్ వేసే విజిల్స్, ముందు రోజు దీపావళి టపాసుల చప్పుళ్ళను తలపించేలా ఉన్నాయి. మరి ‘సింగం’, ‘సింబా’ తర్వాత జనం ముందుకు వచ్చిన ఈ తాజా ఖాకీ హీరో ఏం చేశాడో తెలుసుకుందాం.
వీర్ సూర్యవంశీ (అక్షయ్ కుమార్) యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్. 1993లో జరిగిన ముంబై బాంబు దాడిలో అతను తల్లిదండ్రులను కోల్పోతాడు. అయితే ఆ సమయంలో టెర్రరిస్టులు వంద కేజీల ఆర్డీఎక్స్ లో కేవలం 400 కేజీలే ఉపయోగించారని, మిగిలిన 600 కేజీల ఆర్డీఎక్స్ తో మరోసారి అదే తరహాలో ముంబైపై బాంబు దాడి చేయబోతున్నారని తెలుస్తుంది. గడిచిన పాతికేళ్ళ కాలంలో టెర్రరిస్టులు ఇండియాలో తమ నెట్ వర్క్ ను బాగా పెంచుకోవడమే కాకుండా స్లీపర్ సెల్స్ ను విస్తృత పరిచారనే సమాచారం వీర్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. తన టీమ్ తో వీర్ స్లీపర్ సెల్స్ ను, టెర్రరిస్టులను గుర్తించి ఎలా వారికి బుద్ధి చెప్పాడు? ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి పోలీస్ అధికారులైన సింగం, సింబా ఎలా సాయపడ్డారు? అనేది మిగతా కథ.
రోహిత్ శెట్టి గతంలో తెరకెక్కించిన పోలీస్ చిత్రాలు ఈ దేశానికి పరిమితమైనవి కాగా, ఇది విదేశాలకూ వెళ్ళిన కథ. స్లీపర్ సెల్స్ ను పట్టుకోవడంలో భాగంగా ఆసక్తికరమైన సన్నివేశాలను, యాక్షన్ సీన్స్ ను రోహిత్ శెట్టి రాసుకున్నాడు. కథలో పెద్దంత కొత్తదనం లేకపోయినా, ఈ అంశాలే సినిమాపై ఆసక్తిని కలిగింప చేశాయి. అలానే కేవలం యాక్షన్ కే ప్రాధాన్యం ఇవ్వకుండా అందాల నాయిక కత్రినా కైఫ్ పాత్రకూ దర్శకుడు ప్రాధాన్యమిచ్చాడు. ఓ ఆపరేషన్ లో గాయపడిన వీర్ కు డాక్టర్ రియా (కత్రినా కైఫ్) వైద్యం చేయడం, ఆ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించి, అది పెళ్ళికి దారితీయడం, వారికో కొడుకు పుట్టడం జరుగుతుంది. ఇదంతా ఫ్లాఫ్ బ్యాక్ లో వస్తుంది. అయితే కుటుంబం కంటే డ్యూటీకే ప్రాధాన్యమిచ్చే భర్తతో విసిగి వేసారిపోయి రియా ఒంటరిగా గడపడం మొదలు పెడుతుంది. అలాంటి రియా క్లయిమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంది. రెండున్నర గంటలకు పైగా సాగే ఈ యాక్షన్ డ్రామాలో మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన సన్నివేశాలే ఎక్కువ. బహుశా అందుకే కావచ్చు ఓటీటీ నుండి భారీ ఆఫర్స్ వచ్చిన నిర్మాతలు దానిని తిరస్కరించి, ఆలస్యమైన థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గుచూపారు. వారి నిర్ణయం కరెక్టేనని ఈ సినిమా ఓపెనింగ్స్ నిరూపిస్తున్నాయి. జైసల్మీర్ లో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్స్, బ్యాంకాక్ లో తీసిన భారీ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్. ఇక కత్రీనాకైఫ్ పై చిత్రీకరించిన ‘టిప్ టిప్ బర్సా పానీ’ పాట కుర్రకారుతో విజిల్స్ వేయించేలా ఉంది. అక్షయ్ కుమార్ ఎంట్రీ తో పాటు క్లయిమాక్స్ కు ముందు అజయ్ దేవ్ గన్, రణవీర్ సింగ్ ఎంట్రీ సీన్స్ అదిరిపోయాయి. సినిమా నిడివి కారణంగా అక్కడక్కడా కాస్తంత బోర్ కొట్టించినా, క్లయిమాక్స్ లో ముగ్గురు మాస్ హీరోలు హోరాహోరీ చేసే యాక్షన్స్ సీన్స్, వారిపై చిత్రీకరించిన సాంగ్ సినిమాను నిలబెట్టాయి.
నటీనటుల విషయానికి వస్తే, అక్షయ్ కుమార్ మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు. అలానే అతని మార్క్ కామెడీని వదిలిపెట్టలేదు. కత్రినా కైఫ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను సునాయాసంగా చేసేసింది. అంతే కాదు తెరపై అందంగానూ కనిపించింది. ఇక టెర్రరిస్టులుగా జాకీ ష్రాఫ్, గుల్షన్ గ్రోవర్, అభిమన్యు సింగ్ తో పాటు కుముద్ మిశ్రా, రాజేంద్ర గుప్తా, నికితిన్ ధీర్, సికందర్ ఖేర్, శార్వరీ లోహోకరే, జావేద్ జఫ్రీ తదితరులు ఆకట్టుకునే నటన కనబరిచారు. ఎందుకోసమైతే అజయ్ దేవ్ గన్, రణవీర్ సింగ్ లను రోహిత్ శెట్టి ఎంపిక చేసుకున్నాడో దానికి వారు న్యాయం చేశారు. సంభాషణలు కొన్ని చోట్ల ఉపన్యాసాలను తలపించినా, ఆలోచింపచేసేలా, అర్థవంతంగా ఉన్నాయి. జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ మూవీకి మెయిన్ ఎసెట్స్ గా నిలిచాయి. మొత్తం మీద యాక్షన్ సినిమాలను, కాప్ స్టోరీస్ ను ఇష్టపడే వారికి ‘సూర్యవంశీ’ నచ్చుతుంది. ఇదో పక్కా పైసావసూల్ మూవీ!
ప్లస్ పాయింట్స్
హీరోల ఇండ్రక్షన్ సీన్స్
యాక్షన్ సన్నివేశాలు
మాస్ ను ఆకట్టుకునే సాంగ్స్
మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
మూవీ రన్ టైమ్
రేటింగ్: 2.5 / 5
ట్యాగ్ లైన్: మరో పోలీస్ స్టోరీ!