బాలీవుడ్ ఖిలాడీ అక్కి అకా అక్షయ్ కుమార్ అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో. రియల్ స్టంట్స్, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో అక్షయ్ కుమార్ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు బాలీవుడ్ ని ఏలుతున్న సమయంలో… ఖాన్ త్రయానికి చెక్ పెట్టి ఎదిగిన మొదటి హీరో అక్షయ్ కుమార్ మాత్రమే. అక్షయ్ సినిమా వస్తుంది అంటేనే హిట్ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉండేది. ఆ రేంజులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన అక్షయ్ కుమార్… గత కొన్ని రోజులుగా ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన OMG 2 సినిమాతో వంద కోట్లు కలెక్ట్ చేసి పర్వాలేదనిపించాడు అక్షయ్. అయితే కొత్త హీరోలే వంద కోట్లు రాబడుతున్న సమయంలో అక్షయ్ కుమార్ లాంటి హీరోకి వంద కోట్లు చాలా తక్కువ.
బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు కాబట్టి అక్షయ్ కుమార్ కి వంద కోట్లు ఎక్కువే అనుకుంటున్న సమయంలో సెల్ఫీ, మిషన్ రాణీగంజ్ సినిమాలు ఊహించని షాక్ ఇచ్చాయి. మలయాళ డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకి రీమేక్ గా వచ్చిన సెల్ఫీ సినిమా, మొదటి రోజు రెండు కోట్లని మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ నటించిన కొత్త సినిమా ‘మిషన్ రాణీగంజ్’ కూడా డే 1 కేవలం 2.8 కోట్లని మాత్రమే కలెక్ట్ చేసింది. మంచి కథతో తెరకెక్కిన మిషన్ రాణీగంజ్ సినిమా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, అక్షయ్ కుమార్ హిట్ కొడతాడు అనుకుంటే ట్రేడ్ వర్గాలకి దిమ్మతిరిగి పోయే షాక్ ఇచ్చింది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమా మొదటి రోజు 2.8 కోట్లు మాత్రమే రాబట్టింది అంటే అది దారుణమైన విషయం. మరి నార్త్ ఆడియన్స్ లో అక్షయ్ కుమార్ పై నెగిటివిటి ఉందా? లేక నిజంగానే అక్షయ్ కుమార్ డమ్మీ సినిమాలని చేస్తున్నాడా? ఈ ఫ్లాప్ స్ట్రీక్ నుంచి అక్షయ్ కుమార్ ఎప్పుడు బయట పడతాడు అనేది చూడాలి. మొత్తానికైతే మిషన్ రాణీగంజ్ సినిమా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకి, అక్షయ్ తో సినిమా చేస్తున్న దర్శక నిర్మాతలకి షాక్ వేవ్స్ ఇస్తుంది.