అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ విడుదల తేదీ ఖరారైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ చిత్రం ఏమంటే… ఆగస్ట్ 11వ తేదీ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ విడుదల కాబోతోంది. ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో తొలిసారి అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అతనో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయాలని ఆమీర్ ఖాన్ భావించారు. అదే జరిగితే… ఆగస్ట్ 12న అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ మూవీ దానికి ముందు రోజు విడుదలయ్యే నాగచైతన్య ‘లాల్ సింగ్ చద్దా’తో పోటీ పడబోతున్నట్టే.
మరి అన్నీ చూసుకుని రిలీజ్ డేట్ ను ప్రకటించాల్సిన దర్శక నిర్మాతలు ఇలా ఎలా చేశారన్నది అర్థం కాక అక్కినేని అభిమానులు కాస్తంత టెన్షన్ కు గురవుతున్నారు. కొందరైతే, అదో ఇదో ఒకటి వాయిదా పడుతుందేమో అని ఇప్పటి నుండీ ఊహాగానాలు చేస్తున్నారు. ఇక ‘ఏజెంట్’ మూవీ విషయానికి వస్తే దీనికోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ చేశాడు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబోలో గతంలో ‘కిక్’, ‘రేసుగుర్రం’ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కాస్తంత గ్యాప్ తర్వాత వీరిద్దరూ ‘ఏజెంట్’కు కలిసి పనిచేస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. హిప్ హాప్ తమిళ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.