అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ టీజర్ విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ‘ఏజెంట్’తో బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదల చేసిన టీజర్‌లో కూడా మమ్ముట్టీ ఎంట్రీతోనే మొదలైంది. ఆ తర్వాత ‘ఏజెంట్’ గురించి అతను చెప్పే మాటలతో అఖిల్ ఎంట్రీ జరిగింది. వైరి వర్గాలను ఆట ఆడుకోవడంలో అఖిల్ ఎలాంటి దిట్టో ఈ టీజర్‌లో చూపించాడు సురేందర్ రెడ్డి. శత్రు సైన్యాన్ని కట్టడి చేయడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే ‘ఏజెంట్’గా ఇందులో అఖిల్ నటిస్తున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది.
హాలీవుడ్ స్థాయిలో ఏజెంట్ టీజర్‌లో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. హిప్ హాప్ తమిళ్ సంగీతం, రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనం కూడా ఇందులో స్పష్టం కనిపిస్తోంది. ఇక హీరోయిన్ సాక్షి వైద్యలోనూ ఓ క్యూట్ డైలాగ్ చెప్పించి, ఇది కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదనిపించారు. తెలుగులో తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ స్పై థ్రిల్లర్ ను తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తామని గతంలో దర్శక నిర్మాతలు ప్రకటించారు. కానీ టీజర్ లో ఎక్కడా విడుదల తేదీని చూపించలేదు. అఖిల్ పూర్తి స్థాయి మేకోవర్ తో రూపుదిద్దుకున్న ‘ఏజెంట్’కు వక్కంతం వంశీ కథను అందించారు.