నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వచ్చే సినిమా, అందులో మాస్ అప్పీల్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వీరిద్దరూ గతంలో లెజెండ్, సింహా వంటి రెండు సక్సెస్ ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను ప్రేక్షకులకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల మనస్సులో ఓ ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. అయితే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తాజాగా విడుదలైన ‘అఖండ’ను చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వస్తోంది. ఎక్కడ చూసినా ‘అఖండ’ మేనియానే కొనసాగుతోంది. మరోవైపు మొదటి రోజే బాలయ్య రికార్డుల వేటలో పడ్డారు. అన్ని రికార్డులను బ్రేక్ చేసే దిశగా ‘అఖండ’ దూసుకెళ్తోంది.
Read Also : బాలయ్య ఫ్యాన్స్ కు షాక్… ‘అఖండ’ షోలు ఆపేసిన పోలీసులు
ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ పై బాలయ్య దండయాత్ర కొనసాగుతోంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా చరణ్ రికార్డులను బ్రేక్ చేశాడు బాలయ్య. రామ్ చరణ్ హీరోగా బోయపాటి మునుపటి చిత్రం ‘వినయ విధేయ రామ’ క్లోజింగ్ కలెక్షన్లను ‘అఖండ’ ఒక్కరోజులోనే బ్రేక్ చేయడం విశేషం. యూఎస్ లో మొత్తం 230 ప్రాంతాల్లో విడుదలైన ‘అఖండ’ రాత్రి 9.30 గంటల సమయం వరకు $280కే గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. ఇప్పుడు $300కే దాటి ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. అయితే అక్కడ ‘వినయ విధేయ రామ’ క్లోజింగ్ కలెక్షన్స్ $253కే. ఇక బోయపాటి మరో సినిమా ‘సరైనోడు’ $197కే మార్కును దాటింది.
మొత్తానికి ఈ సినిమా బోయపాటి కెరీర్లోనే అద్భుతమైన చిత్రంగా నిలిచింది. సరికొత్త రికార్డులతో ‘అఖండ’మైన విజయాన్ని అందుకోవడం పట్ల చిత్రబృందం సంతోషంగా ఉంది. బాలయ్య, బోయపాటిలపై ఇది హ్యాట్రిక్ హిట్. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మాస్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్‌ని అందించింది.