Pawan Kalyan: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న కొత్త సినిమా ‘తునీవు’. హెచ్. వినోత్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇక కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పొడుగాటి కుర్చీలో కూర్చున్న అజిత్ చేతిలో గన్ పట్టుకొని కళ్లు మూసుకొని ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. అజిత్ తెల్ల గడ్డం, హెయిర్ తో స్టైలిష్ లుక్ లో బాగానే కనిపించాడు. ఇక ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అజిత్ పోస్టర్ ను వకీల్ సాబ్ నుచి కాపీ కొట్టారని చెప్పుకొస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో పవన్ సామానులు తీసుకెళ్తున్న వ్యాన్ లో చైర్ లో కూర్చొని కాళ్లు చాపి బుక్ చదువుతూ ఉంటాడు. అచ్చు గుద్దినట్లు ఆ పోస్టర్ ను అజిత్ వాడేశాడు అని చెప్పుకొస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ చేతిలో ఉన్నది బుక్ అయితే.. అక్కడ అజిత్ చేతిలో ఉన్నది గన్.. అంతే తేడా అని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఆ రెండు పోస్టర్లను పక్కన పెట్టి చూస్తే ఒకేలా ఉన్నాయే అని అనిపించకమానదు. ఇక మొన్నటికి మొన్న విజయ్ వారసుడు పోస్టర్ కూడా కాపీనే అని గుర్తు చేస్తున్నారు. చంద్రముఖి సినిమాలోని రజినీకాంత్ పోజ్ ను విజయ్ కాపీ కొట్టినట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు అజిత్ వంతు వచ్చింది. ఇలా పోస్టర్లు కాపీ కొట్టడం కాకుండా కొత్తగా ఆలోచించడంటూ సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు పక్కన పక్కన పెట్టి నెట్టింట వైరల్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.