Manchu Lakshmi Prasanna: లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ మోహన్ బాబు, మంచు లక్ష్మీప్రసన్న కలిసి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. విలక్షణ నటుడు సముతిర ఖని కీలకపాత్ర పోషిస్తున్న ఈ మూవీలో మలయాళ నటుడు సిద్దిక్ కీ-రోల్ ప్లే చేస్తున్నారు. విశ్వంత్, చిత్రా శుక్ల తో పాటు పలువురు నటీనటులు ఈ సినిమాలో భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా ‘అగ్నినక్షత్రం’ గ్లిమ్స్ ను ఫిబ్రవరి 14న విడుదల చేశారు. ఒక్క సంభాషణా లేకున్నా నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీని తలపించింది. మంచు లక్ష్మీ ఇన్వెస్టిగేటివ్ అధికారిగా ఓ కేసును సాల్వ్ చేయడానికి ఎంత దూరమైనా వెళుతుందనే విషయం ఈ గ్లిమ్స్ ద్వారా దర్శకుడు వంశీకృష్ణ చెప్పకనే చెప్పారు. మలయాళ చిత్రం ‘మాన్ స్టర్’ కోసం సంప్రదాయ యుద్థకళలను నేర్చుకున్న మంచు లక్ష్మీ ఆ ప్రావీణ్యాన్ని ఈ సినిమాలో కూడా ప్రదర్శించినట్టు ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమౌతోంది. దీని చివరిలో ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్ర పోషించిన మోహన్ బాబు కనిపించడం కొసమెరుపు. అచ్చు రాజామణి నేపథ్య సంగీతం, మధురెడ్డి ఎడిటింగ్ నైపుణ్యం ఈ గ్లిమ్స్ తో తెలుస్తున్నాయి. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీకి గోకుల్ భారతి సినిమాటోగ్రాఫర్. అతి త్వరలోనే విడుదల తేదీని తెలియచేస్తామని మేకర్స్ అంటున్నారు.