అందరికీ తెలిసిన స్వాతంత్ర్య సమరయోధులు చాలా మందే ఉంటారు. కానీ, కొంత మందికే తెలిసిన ఎందరెందరో త్యాగమూర్తులు దేశం కోసం పాటుపడ్డారు. అలాంటి వారిలో ఒక ధీర వనిత గురించి సినిమా రాబోతోంది. ఇప్పటికే ‘షేర్ షా’ మూవీతో పాట్రియాటిక్ బ్లాక్ బస్టర్ అందించిన కరణ్ జోహర్ వెంటనే మరో దేశభక్తి చిత్రాన్ని నిర్మించనున్నాడు.
ఉషా మెహతా అనే గాంధేయవాది క్విట్ ఇండియా సమయంలో చేసిన బ్రిటీష్ వ్యతిరేక పోరాటం గురించి సినిమా తీసే ప్రయత్నాల్లో కరణ్ జోహర్ చాలా రోజులుగా ఉన్నాడు. అప్పట్లో ఆమె ఒక అండర్ గ్రౌండ్ పైరేట్ రేడియో నడిపేదట. కాంగ్రెస్ రేడియో అనే పేరుతో ప్రసారం అయ్యే ఆ ఆకాశవాణి ద్వారా ఆమె తెల్లవారికి సవాలు విసిరింది. ఆమె జీవిత కథనే తెరకెక్కించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కన్నన్ అయ్యర్ అనే దర్శకుడు ఉషా మెహతా బయోపిక్ రూపొందిస్తాడని సమాచారం.
త్వరలోనే ఉషా మెహతా మూవీ కోసం పని చేసే నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని కరణ్ జోహర్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా త్వరలో ఉంటుందట! చూడాలి మరి, ‘షేర్ షా’తో పాట్రియాటిక్ సక్సెస్ కొల్లగొట్టిన ధర్మా ప్రొడక్షన్స్ అధినేత మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేయగలడో లేదో…